Health

కోయంబేడు మార్కెట్‌లో మళ్లీ కోవిద్-TNI బులెటిన్

కోయంబేడు మార్కెట్‌లో మళ్లీ కోవిద్-TNI బులెటిన్

* ఆసియాలో అతి పెద్ద హోల్‌ సేల్‌ మార్కెట్లలో ఒకటైన కోయంబేడులో కొవిడ్‌ కలవరం మళ్లీ మొదలైంది. రెండు వారాల క్రితమే తెరుచుకున్న ఈ మార్కెట్లో సోమవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 50మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. వైరస్‌ సోకినవారిలో ఎక్కువమంది విక్రేతలే ఉన్నట్టు తెలిపారు. మొత్తం 3500 శాంపిల్స్‌ పరీక్షించగా.. 50మందికి పాజిటివ్‌గా తేలిందని వివరించారు. రోజూ దాదాపు 200మందికి పరీక్షలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. సరకుతో వాహనాలు వస్తున్నందున మార్కెట్‌లో నిత్యం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నట్టు చెన్నై పురపాలక శాఖ అధికారులు తెలిపారు. విక్రేతలకు నిరంతరం కొవిడ్‌ టెస్ట్‌లు చేసేందుకు వీలుగా నాలుగు బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నామన్నారు. మే నెలలో ఈ మార్కెట్‌లో పెద్ద ఎత్తున కొవిడ్‌ పాజిటివ్‌లు వచ్చాయి. దేశంలో ఇదో పెద్ద హాట్‌స్పాట్‌గా మారడంతో మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అయితే, హోల్‌ సేల్‌ వర్తకుల ఇబ్బందుల దృష్ట్యా మార్కెట్లో పాక్షికంగా 200 దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతిచ్చారు.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ ఔషధాలు, వ్యాక్సిన్‌తోపాటు కొవిడ్‌ టెస్టులను వేగంగా చేసే సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఆర్‌టీపీసీఆర్‌తో పాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ ర్యాపిడ్‌ పరీక్షల కచ్చితత్వంలో తేడాలుంటున్నాయి. వీటిని అధిగమిస్తూ నూతన టెక్నాలజీతో అధికసంఖ్యలో వేగంగా, కచ్చితఫలితమిచ్చే మరో సాంకేతికతను స్విస్‌ ఫార్మా కంపెనీ తయారుచేస్తోంది. వీటి ద్వారా గంటకు 300శాంపిళ్లను విశ్లేషించడం సాధ్యమని ప్రకటించింది.

* దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ, మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధం వచ్చేవరకు వైరస్‌పై అజాగ్రత్త వద్దని సూచించారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

* ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4,622 కరోనా కేసులు, 35 మరణాలు.రాష్ట్రంలో ఇప్పటివరకు 7,63,573కు చేరిన కరోనా కేసులు.రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,291 మంది మృతి.రాష్ట్రంలో ప్రస్తుతం 42,855 కరోనా యాక్టివ్‌ కేసులు.