ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు : ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల మాదిరిగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఈఓ డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి చెప్పారు.
మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు.
దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ ఇంకా పూర్తిస్థాయిలో తగ్గనందువల్ల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
తాను బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఈ విషయం మీద చైర్మన్, అదనపు ఈఓ, జిల్లా కలెక్టరు, డిఐజి, ఇతర అధికారులతో కూలంకషంగా చర్చించి భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నందు వల్ల దర్శనం టికెట్ల సంఖ్య పెంచే ఆలోచన లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఈఓ సమాధానం చెప్పారు.
ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి అంతకు ముందు శ్రీవారి ఆలయంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అదనపు ఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి , చీఫ్ ఇంజినీర్ శ్రీ ఎం. రమేష్ రెడ్డి ఆయనకు వివరాలు తెలియజేశారు.
శ్రీవారి ఆలయంలోని పరివార దేవతల ఆలయాలు, అన్న ప్రసాదం, లడ్డూ ఇతర ప్రసాదాల తయారీ పోటులు, వగపడి, పరకామణి, వైకుంఠ ద్వారం, అన్నమయ్య బాంఢాగారం, అద్దాల మండపం, కళ్యాణోత్సవ మండపం, తులాభారం, ప్రసాదం పంపిణీ ప్రాంతాలు, లడ్డు కౌంటర్లు, బూందీ పోటుతో పాటు, నూతనంగా నిర్మిస్తున్న పరకామణి భవనం పనులను డాక్టర్ జవహర్ రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఆలయ డిప్యూటి ఈఓ.శ్రీ హరీంద్ర నాథ్,విజిఓ శ్రీ మనోహర్, ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, ఏఈఓలు శ్రీ జగన్మోహనా చార్యులు, శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.