NRI-NRT

పిల్లల్ని కంటే 10వేల డాలర్లు

పిల్లల్ని కంటే 10వేల డాలర్లు

కరోనా మహమ్మారి వల్ల ప్రజల జీవితాలు తారుమారయ్యాయి. ఈ వైరస్‌ వ్యాపారులు, ఉద్యోగులకే కాదు.. పిల్లల్ని కనాలనుకునే జంటలకు కూడా శాపంగా మారింది. జీవితంలో స్థిరపడి ఇక పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్న వారే.. ఇప్పుడు ఈ కరోనా సంక్షోభంలో పిల్లల్ని కనడంపై పునరాలోచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరోనా భయంతో కనడానికి ఇష్టపడట్లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. దీంతో సింగపూర్‌ ప్రభుత్వం వినూత్న పథకం తీసుకొచ్చింది. వివాహిత జంటలు పిల్లల్ని కంటే వారికి నగదు ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించింది. సింగపూర్‌లో గత కొన్నేళ్లుగా జననాల రేటు తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలో అత్యల్ప జననాల రేటు ఉన్న దేశాల్లో సింగపూర్‌ ముందు వరుసలో ఉంది. ఈ సమస్యను అధిగమించడం కోసం గతంలోనే అక్కడి ప్రభుత్వం ‘బేబీ బోనస్‌ క్యాష్‌ గిఫ్ట్‌’ పథకాన్ని తీసుకొచ్చింది. పిల్లల్ని కన్నవారికి ఈ గిఫ్ట్‌ కూపన్‌ ఇస్తారు. దీని ద్వారా దాదాపు 10వేల సింగపూర్‌ డాలర్లు లభిస్తాయి. అయితే కరోనా సంక్షోభంలో అక్కడి వివాహిత జంటలు ఆర్థిక భారం, కరోనా భయంతో పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఇప్పటికే జననాల రేటు తగ్గుతోందని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం.. కరోనా వల్ల ఈ రేటు మరింత దిగజారే అవకాశముందని భావించి ‘ది బేబీ సపోర్ట్‌ గ్రాంట్‌’ పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి 2022 సెప్టెంబర్‌ 30 మధ్య పిల్లల్ని కనే తల్లిదండ్రులకు ఈ పథకం కింద 3 వేల సింగపూర్‌ డాలర్లు నగదు ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించింది. జననాల రేటును పెంచడం కోసమే ఈ పథకం ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. అయితే పొరుగుదేశాల్లో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో జననాల రేటు అధికంగా ఉండడంతో.. జనాభా నియంత్రణకు ఆ దేశ ప్రభుత్వాలు తంటాలు పడుతున్నాయి.