బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో బెంగళూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. శాండిల్‌వుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నిందితుడు ఆదిత్య అల్వా కోసం అతడి బంధువైన వివేక్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడనీ, వివేక్ ఇంట్లో ఉన్నట్టు తమకు అందిన సమాచారం మేరకు సోదాలు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కోర్టు వారెంట్ తీసుకున్న తర్వాతే క్రైం బ్రాంచ్ పోలీసులు వివేక్ ఇంటికి వెళ్లారని బెంగళూరు సంయుక్త పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఆదిత్య అల్వా కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా తనయుడు. శాండిల్‌వుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ వినియోగం, సరఫరా కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే, ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆదిత్య పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా కేసులో కన్నడ తారలు రాగిణి ద్వివేది, సంజన గల్రానీతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
బెంగుళురు డ్రగ్స్ కోసం వివేక్ ఇంట్లో సోదాలు
Related tags :