ScienceAndTech

ఒక్క నెలలో 9 క్షిపణి ప్రయోగాలు చేసిన DRDO

DRDO Launches 9 Missiles In One Month

క్షిపణి ప్రయోగాల్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న తరుణంలోనే భారత అమ్ములపొది శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. సుమారు నెలరోజులుగా వరస ప్రయోగాలు నిర్వహిస్తూ వస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సంప్రదాయ క్షిపణులతో పాటు అణు క్షిపణుల తయారీకి కృషి చేస్తోంది. నాలుగు రోజులకొకటి చొప్పున పరీక్షిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రక్షణ రంగానికి మొదటి నుంచి ప్రాధాన్యమిస్తున్న కేంద్రం దేశీయంగా సమర్థ క్షిపణులు తయారు చేయాలని సంకల్పించుకుంది. దానికి తగ్గట్టుగా క్రమంగా ఒక్కోటి రూపొందించడమే కాకుండా వెనువెంటనే పరీక్షిస్తూ శత్రుదేశాలకు హెచ్చరికలు పంపుతోంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో మొదటి నుంచి చొరవ చూపుతున్న కేంద్రం.. క్షిపణి సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సమర్థ క్షిపణుల్ని దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ బాధ్యతను డీఆర్‌డీవో తన భుజస్కంధాలపై వేసుకొని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తోంది. ఇందులో భాగంగానే 35 రోజుల్లో 9 క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. పదో ప్రయోగంగా నిర్భయ్‌ను పరీక్షించేందుకు సిద్ధమైనా.. చివరి నిమిషంలో డీఆర్‌డీవో రద్దు చేసింది.