DailyDose

భారతీయులు బెంజ్ కార్లు కొనట్లేదు-వాణిజ్యం

భారతీయులు బెంజ్ కార్లు కొనట్లేదు-వాణిజ్యం

* మెర్సిడెస్‌ బెంజ్‌ సెప్టెంబరు త్రైమాసికంలో 2,058 కార్లు విక్రయించింది. 2019 ఇదేకాలంలో విక్రయించిన 3,354 కార్లతో పోలిస్తే, ఈసారి 38.64 శాతం తగ్గాయి. అయితే కొవిడ్‌ ముందు స్థాయికి విక్రయాలు చేరుకోవడం చెప్పుకోదగ్గ అంశం. పండుగ సీజన్‌లో విక్రయాలు ఊపందుకుంటాయని కంపెనీ ఆశిస్తోంది. 2020 జనవరి-సెప్టెంబరులో 5,007 కార్లు విక్రయించింది. ఏడాది క్రితం ఇదేకాల అమ్మకాలు 9,951 కార్లతో పోలిస్తే 49.5 శాతం తక్కువ.

* పది రోజులుగా వరుస లాభాల్లో దూసుకెళుతున్న దేశీయ మార్కెట్ల జోరుకు బ్రేక్‌ పడింది. ఐటీ, ఫైనాన్స్‌ రంగాల్లోని ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడం, అంతర్జాతీయ పరిణామాలు, అక్కడి మార్కెట్ల ప్రభావంతో మన మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. దీంతో సెన్సెక్స్‌ 1000కి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 11,700 దిగువకు చేరింది.

* పండగల వేళ వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు రుణాలు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ పలు బ్యాంకులు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 17 సంస్థలతో కలిసి కొనుగోలుదారులకు రాయితీలు అందించడంతో పాటు, వాయిదాల్లో కొనుగోలు చేసే వెసులుబాటునూ కల్పించనుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ఉన్న వారికి 10శాతం తక్షణ తగ్గింపు అందించేందుకు ఎస్‌బీఐ, ఎస్‌బీఐ కార్డుతో; బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఈఎంఐ కార్డుదారులకు ఎలాంటి రుసుములు లేని ఈఎంఐలను అందించడం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డులు ఉన్నవారికి ఈఎంఐలో చెల్లించే వీలులాంటివి ఇందులో ఉన్నాయి. ప్రముఖ ఆభరణాలు, విద్యుత్‌ ఉపకరణాల విక్రయ కేంద్రాలతోనూ ఒప్పందం కుదుర్చుకుని, గిఫ్ట్‌కార్డ్‌ స్టోర్‌ ప్రారంభించినట్లు ప్లిఫ్‌కార్ట్‌ తెలిపింది.

* తమ రిటైల్ విభాగంలో అమెరికాకు చెందిన అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ కేకేర్‌ నుంచి రూ.5,550 కోట్ల నగదు అందినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్(ఆర్‌ఐఎల్‌) గురువారం ప్రకటించింది. దాంతో రిటైల్ విభాగంలో 1.28 శాతం వాటా ఆ సంస్థ సొంతమైనట్లు తెలిపింది. ఈ ఈక్విటీ వాటా కొనుగోలుకు కేకేఆర్ ముందుకు వచ్చినట్లు సెప్టెంబర్‌ 23న ఆర్‌ఐఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కేకేఆర్‌ విభాగమైన అలీసమ్ ఏషియా హోల్డింగ్స్‌ నుంచి రిలయన్స్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రూ. 5,550 కోట్లు మొత్తాన్ని పెట్టుబడిగా పొందింది. దాని కింద 8,13,48,479 ఈక్విటీ షేర్లను ఆ సంస్థకు కేటాయించాం’ అని ఆర్‌ఐఎల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కాగా, వాటాల విక్రయాలకు ముందు కిరాణ దుకాణాలు, ఫ్యాషన్ రంగ వ్యాపారాలను నిర్వహిస్తోన్న రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ.4.21లక్షల కోట్లుగా ఉంది.

* నీళ్లు, కరెంటు మాదిరి టెలికాం రంగాన్ని అత్యవసర సేవలుగా ప్రభుత్వం పరిగణించాల్సిన అవసరం ఉందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాయ్‌) అభిప్రాయపడింది. ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగంగా కాకుండా భిన్న రంగాలకు ఎంతో ఉపయోగపడే రంగంగా దీనిని చూడాలని తెలిపింది. ఎన్నో మార్పులు తీసుకొని వచ్చే సామర్థ్యమున్న టెలికాం రంగం.. ఇతర రంగాలకు పునాదిగా నిలుస్తుందని బీఐఎఫ్‌ నిర్వహించిన ఓ సమావేశంలో కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.పి. కొచ్చర్‌ తెలిపారు. ‘టెలికాం నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతోపాటు టెలికాం రంగంపై ఆధారపడిన పరిశ్రమల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. దీనిని రెండో ఆదాయం అని నేను అంటాను. అయితే మొదటి ఆదాయానికి మించి రెండో ఆదాయం ఉండబోతోంద’ని ఆయన పేర్కొన్నారు. అందువల్ల టెలికాం రంగాన్ని ప్రత్యేకంగా పరిగణించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. టెలికాం రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందేలా చూడాలని పేర్కొన్నారు.