Business

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు-వాణిజ్యం

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు-వాణిజ్యం

* అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం 1893 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం నాడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

* దసరా పండగను పురస్కరించుకుని ఏపీఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్‌ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపనుంది. సాధారణంగా ఏటా దసరా పండుగకు 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గిపోయింది.ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సుల్ని తగ్గించుకునేందుకు సిద్ధపడినా టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం కొత్త మెలికలు పెడుతోంది. ఏపీఎస్‌ఆరీ్టసీ నడిపే బస్సుల టైం కూడా తామే నిర్దేశిస్తామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా పండుగ నేపథ్యంలో బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ఇంకా అనుమతించకపోవడంతో ఏపీఎస్‌ఆరీ్టసీ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే బస్సులను నడపనుంది. తెలంగాణ వైఖరితో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరని పరిస్థితుల్లో ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 750 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. మరోవైపు దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆరీ్టసీకి అధిక ఆదరణ ఉన్న విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–హైదరాబాద్, విశాఖ–హైదరాబాద్‌ రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభించారు. టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై రవాణా శాఖ కమిషనర్‌ స్పందిస్తూ.. ప్రైవేటు ట్రావెల్స్‌ వారు అధిక రేట్లు వసూలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

* గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల డెలివరీకి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇకపై కేవలం సిలిండర్‌ బుక్‌ చేస్తే సరిపోదు.. డెలివరీ సమయంలో మొబైల్‌కు వచ్చే ఓటీపీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సిలిండర్లు పక్కదారి పట్టకుండా అసలైన వినియోగదారులకు సిలిండర్ల చేరవేతే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకురావాలని ఆయిల్‌ కంపెనీలు యోచిస్తున్నాయి.

* ప్రధాని మోదీ పిలుపునిచ్చిన దేశీయ తయారీ విధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే వివిధ కలర్‌ టీవీలను ఇతర దేశాలను నుంచి దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించిన భారత్‌.. తాజాగా ఏసీల దిగుమతిపై కూడా నిషేధం విధించింది. దేశీయ తయారీని ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన సాధించడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న భారీ నష్టాలతో ముగిసిన సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 350 పాయింట్లు లాభపడింది. ఉదయం 9.53 సమయంలో సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 39,806 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11,694 వద్ద ట్రేడవుతున్నాయి.