Devotional

దుర్గమ్మ సన్నిధిలో VIPలకు ప్రత్యేక సమయాలు

దుర్గమ్మ సన్నిధిలో VIPలకు ప్రత్యేక సమయాలు

న‌వ‌రాత్రుల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామ‌ని, ద‌ర్శ‌నానికి వ‌చ్చే వాళ్లు మాస్క్ స‌హా అన్ని నిబంధ‌న‌లు పాటించాల‌ని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఆల‌య ద‌ర్శ‌నానికి ఇప్ప‌టికే 74వేల టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అయ్యాయ‌ని, ప్ర‌స్తుతం కేవ‌లం 1500 టికెట్లు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌న్నారు. ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం పూర్తయిన సంద‌ర్భంగా రేపటి నుంచి దర్శనాలకు అనుమతిస్తున్న‌ట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాల‌ని ఆల‌య ఈవో సురేష్ బాబు అన్నారు. ఇక‌వేళ టికెట్ స‌మ‌స్య‌లు ఉన్నవాళ్ల‌కి పున్నమి ఘాట్,మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయని తెలిపారు. మూల నక్షత్రం రోజున‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారని ఈవో పేర్కొన్నారు. ఈసారి సామూహిక పూజ‌లు లేవ‌ని, విఐపిలకు ఉదయం 7 నుంచి 9 వరకు సాయంత్రం 3నుంచి 5 గంటలు వరకే అనుమతి ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీఐపీలు కూడా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల‌ని ఆ టైం స్లాట్ ప్ర‌కార‌మే ద‌ర్శ‌నానికి రావాల్సిందిగా తెలిపారు.