WorldWonders

ఈ అడవి చీమల ఛట్నీ అదుర్స్

ఈ అడవి చీమల ఛట్నీ అదుర్స్

మన రోజువారీ జీవన విధానంలో అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలతో చేసిన చట్నీలు తింటూనే ఉంటాం. నాన్‌ వెజ్ పచ్చళ్లూ ఆరగించే ఉంటాం. అయితే ఇప్పుడు చూడబోయే ఓ పచ్చడి మాత్రం ఎప్పుడూ తిని ఉండరు. కనీసం అలాంటి ఓ చట్నీ గురించి వినే ఉండరు. అదే చీమల పచ్చడి. ఛత్తీస్​​గఢ్​లోని జగదల్​పూర్​ మార్కెట్​లో లభించే చీమల పచ్చడికి ఉండే డిమాండే వేరు.
*రోగనిరోధక శక్తిని పెంచే చీమల చట్నీఛత్తీస్​గఢ్​ జగదల్‌పూర్‌ మార్కెట్‌లోని ‘చీమల పచ్చడి’కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ ఎర్రచీమల పచ్చడిని స్థానికంగా చాప్​ డా అని పిలుస్తారు. ఈ చట్నీ అమ్మకంతో ఆదివాసీలు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.

**ఎలా చేస్తారు?
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అడవుల్లోని సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలు గూళ్లు పెడతాయి. స్థానికులు చెట్లెక్కి, ఈ చీమలు సేకరిస్తారు. ఈ చట్నీ తయారుచేసేందుకు ముందుగా వాటిని రుబ్బుతారు. ఆ పేస్ట్‌కు ఉప్పు, కారం కలిపితే చట్నీ సిద్ధమవుతుంది. కొందరు అల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు.

“చీమల పచ్చడి వల్ల చాలా లాభాలున్నాయి. జ్వరం, జలుబు లాంటి అస్వస్థతలకు మందుగా పనిచేస్తుంది. ప్రతిసారి మార్కెట్‌లో మేం ఇది కొనుక్కుంటాం”.—-స్థానికుడు

**జ్వరం వస్తే చీమలే ఔషధంఆదివాసీలకు జ్వరం వస్తే చెట్టు కింద కూర్చుని, చీమలతో కుట్టించుకుంటారు. ఇలా చేస్తే జ్వరం తగ్గుతుందని వాళ్లు నమ్ముతారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్‌ యాసిడ్ ఉంటుంది. ప్రొటీన్, కాల్షియం కూడా ఉండడం వల్ల చీమలు మలేరియా, కామెర్లు చికిత్సలోనూ ఉపయోగపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు చీమల్లో ఉంటాయి.

“సర్గీ చెట్లు, ఇంకా కొన్ని రకాల చెట్లపై చీమలు ఉంటాయి. వాటిని పట్టుకుని ఇంటికి తీసుకెళ్తాం. ఆ చీమలతోనే పచ్చడి తయారుచేస్తాం. శరీర ఆరోగ్యానికి ఈ చట్నీ చాలా మంచిది. కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుంది.”—-స్థానికుడు

*పర్యాటకులకు పసందైన రుచి
దేశీయ, అంతర్జాతీయ పర్యటకులకు చీమల పచ్చడిని బస్తరియా చట్నీ పేరుతో వడ్డిస్తారు. జగదల్‌పూర్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు సైతం పర్యటకుల కోసం ఈ పచ్చడి అందుబాటులో ఉంటుంది.