తమది కాని రూ.కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి ఓ రియల్టర్‌ను మోసం చేసిన సంఘటనలో వ్యాఖ్యాత కత్తి కార్తికతోపాటు మరో ఆరుగురిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. ఎస్సై కన్నెబోయిన ఉదయ్ కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని టచ్‌స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎం.డి. దొరస్వామికి టీమ్‌వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎం.డి. శ్రీధర్ గోపిశెట్టితో దాదాపు 20 ఏళ్ల పరిచయం ఉంది. తమ సంస్థ విస్తరణలో భాగంగా శివారులో భూమి కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు దొరస్వామి తన స్నేహితుడైన శ్రీధర్‌కు తెలిపారు. దీంతో తనకు కత్తి కార్తిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్తీక గ్రూపుతోపాటు పలువురు వ్యాపారులు తెలుసని వారికి తెలియజేస్తే అవసరమైనచోట తగిన భూమిని ఇస్తారని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెలలో కత్తి కార్తికతోపాటు నువ్వాల శివరాం, తెన్నేరి భీమ్‌సేన్ తదితరులు దొరస్వామిని కలిశారు. మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లో సర్వే నంబర్లు 322, 323, 324, 329లలో దాదాపు 52 ఎకరాల స్థలం ఉందని, ఇందులో తమకు సైతం కొంత వాటా ఉందని దొరస్వామి దృష్టికి తీసుకెళ్లారు. తమ మధ్య డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ ఉందని చెప్పారు. ఈ మొత్తం స్థలాన్ని రూ.35కోట్లకు విక్రయిస్తామని స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు, జీపీఏలున్నాయని వారు నమ్మించారు. స్థలం కొనుగోలుకు రూ.కోటి అడ్వాన్స్‌గా చెల్లించాలని సూచించారు. దీంతో కత్తి కార్తికతోపాటు ఆమె సూచించిన ఖాతాల్లోకి ఆయా డబ్బును జమ చేశారు. అనంతరం ఈ స్థలం సిస్లా రమేష్ అనే వ్యక్తిదని దొరస్వామి గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దొరస్వామి స్థలం అసలు యజమానిని సంప్రదించగా ఆయన తాము రూ.80 కోట్లకు విక్రయిస్తామని, ఈ స్థలంతో కత్తి కార్తికకుగాని ఇతరులకుగాని సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఉద్దేశపూర్వకంగా తనను తప్పుదోవ పట్టించి మోసానికి పాల్పడ్డ కత్తి కార్తిక, శ్రీధర్ గోపిశెట్టి, నువ్వాల శివారం ప్రసాద్, అందె మురళీకృష్ణ, భీమ్‌సేన్ తదితరులపై మోసం కేసు నమోదు చేయాలంటూ శుక్రవారం దొరస్వామి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్తికతోపాటు మిగిలిన ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 406, 420, 120(బి), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
₹35కోట్ల రూపాయిల కుంభకోణం కత్తి కార్తీక
Related tags :