‘‘న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్.లక్ష్మణన్ సంతాప సభలో శనివారం వీడియో ద్వారా ఆయన మాట్లాడారు. ‘‘ఒక వ్యక్తి మంచి జీవితం కొనసాగించాలంటే ఎన్నో గుణాలను అలవరచుకోవాలి. వినయం, ఓర్పు, దయ, కచ్చితమైన కార్యాచరణ, నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరచుకోగలిగే ఉత్సాహం వంటి లక్షణాలను కలిగి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యం… ప్రత్యేకించి న్యాయమూర్తులు తమ విలువలకు బలంగా కట్టుబడి ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో నిర్భయంగా ఉండాలి. ఒత్తిళ్లు, ఆటంకాలు, అన్ని రకాల ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోగలగాలి. ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు ఉన్న గొప్ప బలం. నమ్మకం, ఆమోదయోగ్యతలు బలవంతపెడితే రావు. వాటిని సంపాదించుకోవాలి. మన విలువలే మనకున్న గొప్ప సంపద. వాటిని ఎప్పుడూ మరిచిపోకూడదు. న్యాయవ్యవస,్థ అత్యున్నత స్థాయిలో ఉన్న బార్ బెంచ్‌లు కలిసి… మనకు సమర్థత, నిబద్ధత, నిర్భీతితో కూడిన స్వతంత్ర వ్యవస్థను వారసత్వ సంపదగా ఇచ్చాయని జస్టిస్ లక్ష్మణన్ అన్న మాటలను మనమంతా గుర్తుంచుకోవాలి. ఆయన మాటల నుంచి మనం స్ఫూర్తిని పొంది ప్రస్తుత సమయంలో అత్యవసరమైన శక్తిమంతమైన స్వతంత్ర న్యాయవ్యవస్థ కోసం పాటుపడాలి’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో రాముడికున్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ… ‘‘ఓ మహానుభావుడు చెప్పిన మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. ప్రజలు రాముణ్ని కొలవాల్సింది ఆయన విజయాలను చూసికాదు, అత్యంత కష్టసమయాలను కూడా చాలా సంతోషంగా ఎదుర్కొన్న విధానాన్ని చూసి. అదే విలువలకిచ్చే గౌరవం. ఒకరి జీవితంలో అత్యంత గొప్ప క్షణాలు అవే. నీకు ఎంత ఉందన్నది ఇక్కడ ప్రశ్నకాదు. నీవు ఏం చేశావు, దాని వల్ల ఏం జరిగింది, ఏం జరగలేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, వాటిని నీవు ఎలా ఎదుర్కొన్నావన్నదే ముఖ్యం. అదే నీ సత్తా ఏంటో నిర్ణయిస్తుంది’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. మద్రాస్ బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ కొఠారీ, మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కె.పరాశరన్, మద్రాస్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఎం.రవీంద్రన్ పాల్గొన్నారు.
న్యాయమూర్తులు నిర్భీతితో వ్యవహరించాలి
Related tags :