* ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్ మరోసారి నిషేధం విధించింది. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 30 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ వెల్లడించింది. కరోనా సమయంలో ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించడం ఇది మూడోసారి. గతంలో ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 వరకు, ఆ తర్వాత సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 31 వరకు నిషేధం విధించింది.
* పండుగ సీజన్ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు గ్రేట్ ఇండియన్ సేల్స్, బిగ్ బిలియన్ డేస్ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తీరుపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి, ఇతర మూలాలు తెలిపే సమాచారం పొందుపరచకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ రెండు ఈ-కామర్స్ దిగ్గజాలకు నోటీసులు జారీ చేసింది. స్పందించేందుకు 15 రోజుల సమయం ఇచ్చింది. ఇకపై ఈ నిబంధనల్ని ఏ ఈ-కామర్స్ సంస్థ విస్మరించరాదని స్పష్టం చేసింది.
* జులై – సెప్టెంబరు త్రైమాసికానికి ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 26 శాతం క్షీణించి రూ.308 కోట్లకు పరిమితమైంది. 2019-20 ఇదే సమయంలో నికర లాభం రూ.417 కోట్లు కావడం గమనార్హం. మొండి బకాయిలకు అధిక కేటాయింపుల వల్లే లాభంలో క్షీణతకు కారణమైంది. మొత్తం ఆదాయం ఏడాదిక్రితం నమోదైన రూ.3,675 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.3,997 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం కూడా 7 శాతం అధికమై రూ.3,488 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు 3.07 శాతం నుంచి 2.84 శాతానికి తగ్గగా.. నికర నిరర్థక ఆస్తులు కూడా 1.59 శాతం నుంచి తగ్గి 0.99 శాతానికి పరిమితమయ్యాయి. విలువపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు రూ.3,612.11 కోట్ల నుంచి రూ.3,552.19 కోట్లకు, నికర నిరర్థక ఆస్తులు రూ.1,843.64 కోట్ల నుంచి రూ.1,218.40 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలకు, ఇతరత్రా అవసరాలకు సమీక్షా త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్ రూ.592.06 కోట్లు కేటాయించింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో కేటాయించిన రూ.251.77 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువ కావడం గమనార్హం.
* భారత్‌లోని మహిళా పారిశ్రామిక వేత్తలు తమ వ్యాపార నమూనాలను వేగంగా మారుస్తున్నారు. కొవిడ్ కారణంగా తగ్గుతున్న ఆదాయాల నేపథ్యంలో తమ కార్యకలాపాల్లో మార్పులు చేస్తున్నారు. బెయిన్ అండ్ కో, గూగుల్, ఏడబ్ల్యూఈ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మొత్తం 350 మందిని సర్వే చేయగా.. 54 శాతం మంది ఇప్పటికే వ్యాపారాన్ని మార్చుకున్నట్లు (సరికొత్త ఉత్పత్తులు లేదా సేవలు) తెలుపగా.. మరో 24 శాతం మంది డిసెంబరు కల్లా ఆ పనిచేయనున్నట్లు తెలిపారు. 46 శాతం మంది కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడతామని 90 శాతం మంది ధీమా వ్యక్తం చేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం మహిళా వ్యాపారవేత్తలపై సమానంగా అయితే కనిపించలేదు. భారత్‌లో 1.6 కోట్ల మంది మహిళలు సొంతంగా వ్యాపారాలుండగా.. దాదాపు ఏక వ్యక్తి కార్యకలాపాలు ఉన్నవి ఎక్కువగా ఉన్నాయి. అంటే వ్యాపారం నిలబెట్టుకోవడం చాలా కీలకమన్నమాట. కరోనా ప్రభావం మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో 70 శాతానికి పైగా ప్రతికూలంగా కనిపించగా.. 20 శాతం దాదాపు తుడిచిపెట్టుకుపోయే స్థాయికి చేరాయి.
* సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో టాటా కమ్యూనికేషన్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.384.81 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.54.31 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది ఏడింతలు అధికం కావడం గమనార్హం. ఇక మొత్తం ఏకీకృత ఆదాయం రూ.4,282.3 కోట్ల నుంచి 4.5 శాతం పెరిగి రూ.4,477.18 కోట్లకు చేరింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ స్థలంతో కూడిన భవనాన్ని రూ.67.41 కోట్లకు విక్రయించింది. ఇక సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల కింద రూ.6,633.43 కోట్లు చెల్లించాల్సిందిగా డాట్ నుంచి నోటీసు వచ్చిందని కంపెనీ వెల్లడించింది. దీనిపై పోరాటం చేస్తామని, అయినప్పటికీ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.337.17 కోట్లు కేటాయింపులు జరిపినట్లు వెల్లడించింది.