DailyDose

కమలా బైడెన్‌ల కోసం కదిలిన ఒబామా-తాజావార్తలు

కమలా బైడెన్‌ల కోసం కదిలిన ఒబామా-తాజావార్తలు

* అత్యంత ప్రజాదరణ కలిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతుగా ఒబామా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రచార కమిటీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 21న ఫిలడేల్ఫియా, పెన్సిల్వేనియాలో జరిగే ప్రచారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఒబామా హయాంలో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై నాలుగేళ్లు గడుస్తున్నా.. ఒబామాకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. మంచి వక్తగా పేరుంది. అందుకే ట్రంప్‌నకు దీటుగా ఆయనను ప్రచారంలోకి దింపాలని పార్టీ భావించింది. మరోవైపు ఒబామా ప్రచారంపై ట్రంప్‌ విమర్శలు చేశారు. ప్రజలపై ఆయన అంతగా ప్రభావం చూపలేరని వ్యాఖ్యానించారు. అందుకే 2016లో ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు.

* ఇటీవల కురిసిన భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ వర్షం కురిసింది. రెండు రోజుల విరామం తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో మరోసారి మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడింది. విద్యానగర్‌, గోల్నాక, రామంతాపూర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, అంబర్‌పేట, కాచిగూడలో మోస్తరు వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, కొత్తపేట, సరూర్‌నగర్‌, సైదాబాద్, చంపాపేట, ఎల్బీ నగర్‌, మన్సూరాబాద్, నాగోల్‌, హబ్సిగూడ, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీ.ఎన్‌.రెడ్డి ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, రాయదుర్గం, పాతబస్తీ పరిధిలోని షేక్‌పేట, మదీనా, చార్మినార్‌, గోల్కొండ, టోలిచౌకి, లంగర్‌హౌజ్‌, మెహదీపట్నం, కార్వాన్‌, బహదూర్‌పుర, జూపార్క్‌, పురానాపూల్ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షంతో చేరిన వరద నీరు పోయినప్పటికీ బురద పేరుకుపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టోలీచౌకి వద్ద వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో బయో-డైవర్సిటీ, గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని పోలీసులు తెలిపారు.

* కరోనా నుంచి కోలుకున్న కథానాయిక తమన్నా తనకు చికిత్స అందించిన వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యంతో భయపడుతున్న సమయంలో తనలో ఆత్మస్థైర్యం నింపి, చికిత్స అందించారని పేర్కొన్నారు. వారి దయ, కేరింగ్‌ వల్ల సౌకర్యంగా ఫీల్‌ అయినట్లు చెప్పారు.

* నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల నుంచి నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరదలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, కలెక్టర్‌ శ్వేత మహంతి, అధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సీఎం రిలీఫ్‌ కిట్‌ అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కిట్‌లో రూ. 2,800 విలువైన నిత్యావసరాలు, 3 బ్లాంకెట్లు ఉన్నట్లు చెప్పారు. వరద ప్రాంతాల్లో ఆరోగ్యకర పరిస్థితులు తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు ప్రత్యేకంగా శానిటైజేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో లార్వా స్ప్రేయింగ్‌, సోడియం హైపోక్లోరేట్‌ను చల్లాలని చెప్పారు. అంతేకాకుండా క్రిమిసంహారక ద్రావణాలను అన్ని ప్రాంతాల్లో పిచికారి చేయాలని కేటీఆర్ ఆదేశించారు.

* న్యూజిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో సెంటర్‌ లెఫ్ట్‌ లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ నేతృత్వంలోని ఆ పార్టీ అపూర్వ విజయం సొంతం చేసుకుంది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో దూకుడుగా వ్యవహరించిన ఆమెకు అక్కడి ప్రజలు రెండోసారి ఘన విజయం అందించారు. 70శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధాన ప్రత్యర్థి జుడిత్ కాలిన్స్‌ ఓటమిని అంగీకరించడం గమనార్హం. మూడింట రెండొంతుల ఓట్లు లెక్కించే సరికే ఆర్డెర్న్‌కు చెందిన లేబర్‌ పార్టీ 49.2శాతం ఓట్లను సాధించింది. మొత్తం 120 సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో లేబర్‌ పార్టీ 64సీట్లు సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో 1996లో దామాషా పద్ధతిలో ఓటింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి స్థాయి ఏ పార్టీకీ మెజార్టీ దక్కలేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది. కానీ తాజా ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి న్యూజిలాండ్‌ ప్రజలు తొలిసారి పూర్తి మెజార్టీని కట్టబెడుతూ సంచలన విజయం అందించారు.

* గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 70,881 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,676 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 24 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,79,146కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,406 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 5,529 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,35,638కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,102 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 69,91,258 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.

* నగరంలో ఆకస్మాత్తుగా వర్షాలు కురిస్తే సహాయ చర్యలు చేపట్టడంలో జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో.. రాష్ట్రం ఎటు వెళ్తుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి నిద్రలోనే కొంతమంది మృతి చెందారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి ఎక్కడ పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌రావు ఆధ్వర్యంలో ఈ ఏడేళ్ల కాలంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటిపైనా సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుందన్నారు. కల్వకుర్తి పరిశీలన కోసం వెళ్తున్న కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకున్నారని భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

* కాంగ్రెస్‌, భాజపా ఎండమావులు వంటివని.. వారి వెంటవెళ్తే ఏమీరాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని ముబారస్‌పూర్‌లో హరీశ్‌రావు ప్రసంగించారు. కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాలు రాష్ట్రంలో తాగునీటి సమస్య కూడా తీర్చలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో విద్యుత్‌ ఇవ్వకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. వానాకాలంలో ఉసిల్లు వచ్చినట్లు కాంగ్రెస్‌, భాజపా నేతలు వచ్చిపోతారని.. తెరాస మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తోందన్నారు.

* కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈనెల 26, 27వ తేదీల్లో జరిగే విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను భక్తులందరూ పాటించాలని జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ విజ్ఞప్తి చేశారు. పైడితల్లి ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల అనుమతి తదితర అంశాలపై కలెక్టర్‌ కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి, ప్రజాప్రతినుధులతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ నియంత్రణ మార్గదర్శకాలను అనుసరించి ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కొవిడ్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వారినే సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు అనుమతించనున్నట్టు స్పష్టం చేశారు.

* పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో భూలావాదేవీల కోసం విప్లవాత్మకమైన ‘ధరణి’ పోర్టల్ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్లు, తహసీల్దార్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లతో శనివారం దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా ధరణి సన్నద్ధతపై సమీక్షించారు. పోర్టల్ పనితీరు, లావాదేవీల నిర్వహణకు సంబంధించి సీఎస్ వివరించారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. వినూత్నమైన, విప్లవాత్మకమైన ఈ పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

* కరోనా టీకా తొలిదశ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. తొలిదశలో దేశంలోని 23 శాతం జనాభాకు కరోనా టీకా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు సైతం వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వీరిలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

* ఇతర ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వ్యాక్సిన్ల మాదిరిగా కాకుండా, కొవిడ్-19 కట్టడికి ప్రతి సంవత్సరం వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ రిచర్డ్ మిహిగో అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సంస్థకు చెందిన ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయంలో రోగనిరోధకత, వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమం ఏరియా మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆయన మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జన్యువుల్లో మార్పుల కారణంగా ఫ్లూ వ్యాక్సిన్‌ను ఏటా పునరావృతం చేయాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం. కరోనా వైరస్‌ విషయంలో ఈ అవసరం ఉండకపోవచ్చని మేం విశ్వసిస్తున్నాం’ అని రిచర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

* నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 94వ స్థానంలో నిలవడంపై ట్విటర్‌లో మండిపడ్డారు. తమ ‘ప్రత్యేక మిత్రుల’ జేబులను నింపడంలో కేంద్రం తీరికలేకుండా ఉందని, అందుకే దేశంలోని పేదలు ఆకలితో అలమటిస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ ఆకలి సూచీ -2020 నివేదికలో 107 దేశాలకు గాను భారత్‌ 94వ స్థానంలో నిలవవడాన్ని ప్రస్తావించిన రాహుల్‌.. పొరుగుదేశాలైన పాకిస్థాన్‌ (88), నేపాల్‌ (73), బంగ్లాదేశ్‌ (75)లు భారత్‌ కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయని పేర్కొంటూ అందుకు సంబంధించిన గ్రాఫ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

* షింజియాంగ్ ప్రావిన్సులోని వీగర్‌ ముస్లింలపై చైనా ఆకృత్యాలను అమెరికా మరోసారి ఎండగట్టింది. వారి విషయంలో మారణహోమానికి ఏమాత్రం తీసిపోని చర్యలకు చైనా పాల్పడుతోందని తీవ్రంగా మండిపడింది. అక్కడి మైనార్టీల స్థితిగతులపై యూఎస్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్ మాట్లాడుతూ..‘అది మారణహోమం కాకపోతే, అలాంటిదే ఏదో జరుగుతోంది’ అంటూ ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో భాగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వీగర్‌ మహిళల జుత్తును తీసివేసి, దాంతో వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసి, వాటిని అమెరికాకు పంపుతోంది’ అంటూ ఓబ్రీన్ మండిపడ్డారు.

* నవంబరు మూడున జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘పోల్‌ నంబర్లు చాలా బలంగా ఉన్నాయి. పెద్ద సమూహాలు, గొప్ప ఉత్సాహం, భారీ రెడ్ వేవ్ వస్తోంది!!!’ అంటూ ట్రంప్‌ ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకొని తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన తాజాగా ట్విటర్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మనం రెడ్ వేవ్‌ను చూడబోతున్నాం. మన ప్రజలు వెళ్లి, ఓటు వేయాలనుకుంటున్నారు. ఇది పెద్ద, అందమైన రెడ్ వేవ్‌ కానుంది’ అంటూ నార్త్ కరోలినాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసగించారు.