తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు రూ.4,450 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు శనివారం ఆయన లేఖ రాశారు. వరద సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు తక్షణ సాయంగా కనీసం రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. ‘భారీవర్షాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలకు తోడు.. ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది. చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, కూరగాయలు, అరటి, బొప్పాయి తదితర పంటలు దెబ్బతిన్నాయి’ అని వివరించారు. ‘ఈనెల 13న తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లా కాట్రేనికోనలో 228, తాళ్లరేవులో 200.50, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో 205.30, పెరవలిలో 204.20 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. దీనికితోడు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజి సహా పలుచోట్ల లోతట్టు ప్రాంతాల వారిని సహాయ శిబిరాలకు తరలించాం’ అని తెలిపారు. ‘పలు జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. ఎక్కడి వాగులు అక్కడ పొంగడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వేర్వేరు ఘటనల్లో 14 మంది చనిపోయారు’ అని వివరించారు. ‘కొవిడ్‌తో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రంలో.. ఇప్పుడొచ్చిన వర్షాలు, వరదలతో పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు మీ అండ, చేయూత అవసరం’ అని విజ్ఞప్తి చేశారు.
మాకు ఒక ₹1000కోట్లు ఇవ్వండి
Related tags :