కొంతమంది తరచూ ఆందోళనకి లోనవుతుంటారు. అది వాళ్ల స్వభావం అని సరిపెట్టుకుంటాం. కానీ దానికి కారణం థైరాయిడ్ గ్రంథిలోని లోపమే అంటున్నారు మానసిక నిపుణులు. 2017 నాటికి మనదేశంలోనే నాలుగున్నర కోట్ల మంది యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారట. అయితే ఒత్తిడి, ఆందోళన అనగానే అందరూ నాడీవ్యవస్థలోని లోపాలుగా భావిస్తారుగానీ హార్మోన్ల అసమతౌల్యత అని గుర్తించరు. కానీ థైరాయిడ్ కారణంగానూ ఆ సమస్య రావచ్చు అంటున్నారు క్వియ్ ఆసుపత్రి నిపుణులు. సాధారణంగా థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, ట్రిడో థైరోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా గుండె, కండరాలు, జీర్ణవ్యవస్థ, మెదడు భాగాలను నియంత్రిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు స్వీయరోగనిరోధక వ్యవస్థ ఎదురు తిరగడంతో యాంటీబాడీలు విడుదలై థైరాయిడ్ గ్రంథికి హాని కలిగిస్తాయి. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా గుర్తించేందుకు ఆందోళనతో బాధపడేవాళ్ల థైరాయిడ్ గ్రంథిని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా పరిశీలించినప్పుడు- అందులో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా కనిపించిందట. దాంతో ఆఇన్‌ఫ్లమేషన్ తగ్గేందుకు పదిహేను రోజులపాటు మందులు ఇవ్వగా వాళ్లలో ఆందోళన తగ్గిందట. దీన్నిబట్టి యాంగ్జయిటీ అనగానే మెదడు, నరాలకు సంబంధించిన పరీక్షలే కాదు, థైరాయిడ్ గ్రంథినీ పరీక్షించాలని చెబుతున్నారు సంబంధిత నిపుణులు.
ఆందోళన ఆందోళనపరుస్తోందా?
Related tags :