* అనంతపురంలో ఒకేరోజు మూడు హత్యల కలకలం రేగింది.ఆదివారం ఉదయం అనంతపురంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు.మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు.బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువుకట్టపై గుజరీ అమ్ముకునే ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు.ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.మరోవైపు.. శింగనమల మండల పరిధిలోని నాయనిపల్లి క్రాస్‌లో ఉన్న పొలాల వద్ద ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టారు.మృతురాలు పెద్దపప్పూరు మండలం నరసాపురానికి చెందిన నరసమ్మగా పోలీసులు గుర్తించారు.ఈ హత్యకు పొలం వివాదాలే కారణం అని తెలుస్తోంది… ఇదిలా ఉండగా..నల్లమాడ మండలం రెడ్డికుంట తండాల్లోని బుక్కా కాసేనాయక్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తండా సమీపంలోని వంకలో బండరాయితో మోది హత్య చేశారు.జిల్లాలో ఒకేరోజున ముగ్గురు హత్యకు గురికావడం ప్రజల్లో తీవ్ర భయాందోళను రేకెత్తించింది.ఈ మూడు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
* రాష్ట్రంలో కొత్తగా 3,986 కరోనా కేసులు, 23 మరణాలు.రాష్ట్రంలో 7,83,132కు చేరిన కరోనా బాధితుల సంఖ్య.రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 6,429 మంది మృతి.రాష్ట్రంలో ప్రస్తుతం 37,102 కరోనా యాక్టివ్ కేసులు.ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 7,35,638 మంది బాధితులు.రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 70,881 కరోనా పరీక్షలు.రాష్ట్రంలో ఇప్పటివరకు 69.91 లక్షల మందికి కరోనా పరీక్షలు.
* లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో తమకెలాంటి సంబంధాల్లేవంటూ ఇటీవల భాజపా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ స్పందించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ను సంతృప్తి పరిచేందుకే ఆ పార్టీ అలాంటి వ్యాఖ్యలు చేస్తోందే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
* రంగారెడ్డి జిల్లా పరిధి గగన్‌పహాడ్ వద్ద బురదలో ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. మృతుడు గగన్‌పహాడ్‌కు చెందిన అయాన్ (7)గా అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు గగన్‌పహాడ్ వద్ద బురదలో ఆరు మృతదేహాలు లభించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లాలోని అప్ప చెరువు ఈ నెల 14న తెగింది. చెరువు తెగడంతో జాతీయ రహదారిపైకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఇదే సమయంలో వరద ధాటికి జాతీయ రహదారిపై వెళ్తున్న వ్యక్తులు, పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వరద ఉద్ధృతి తగ్గడంతో గగన్‌పహాడ్ వద్ద బురదలో ఒక్కొక్కటిగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 14న గల్లంతైన వారి సంఖ్య విషయంలో ఇప్పటికీ అధికారుల్లో ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. గల్లంతై, చనిపోయిన వారి వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
* రానున్న శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలు భయాందోళన కలిగిస్తున్నాయి. నీతి ఆయోగ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ రానున్న శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలను కొట్టివేయలేమన్నారు. కరోనా కట్టడి చర్యల సమన్వయ బృందానికి నేతృత్వం వహిస్తున్న వీకే పాల్ న్యూస్ ఏజెన్సీ పీటీఐతో ఆదివారం మాట్లాడారు. యూరోప్‌లో తిరగబెడుతున్న కేసులను గుర్తుచేస్తూ శీతాకాలంలో భారత్‌లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్‌లో అలా జరిగే అవకాశాలు ఉన్నాయని, దీనిపై మరింత పరిశోధనలు జరుపుతున్నామని వెల్లడించారు. దేశం ప్రస్తుతం మెరుగైన స్థితిలోనే ఉందని, కానీ ఇంకా అనేక అవరోధాలను దాటాల్సి ఉందన్నారు.
* భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అయింది. వరద ఉద్ధృతి నుంచి కోలుకునే లోపే రాత్రి మరోసారి వర్షం పడటంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. పాతబస్తీ బాబానగర్ ప్రాంత వాసులు సర్వస్వం కోల్పోయారు. గుర్రం చెరువుకు గండిపడటంతో దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రవాహం తగ్గడంతో ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు రావడంతో ఏం జరిగిందోనని తేరుకునే లోపే ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులను ఇళ్లపైకి ఎక్కించారు. మరి కొందరు ఆ నీటిలోనే ఎత్తైన ఇళ్లకు చేరుకున్నారు. చూస్తూ ఉండగానే వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. వరదనీటిని మళ్లించేందుకు కాలువ ఏర్పాటు చేశారు.
* ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని.. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ అండర్ గ్రౌండ్ పంప్‌హౌజ్‌కే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు.
* ‘బాండ్… జేమ్స్‌బాండ్’ అంటూ కథానాయకుడు డైలాగ్ చెబుతుంటే… కళ్లప్పగించి మరీ చూస్తారు ప్రేక్షకులు. బాండ్ చిత్రాలకున్న క్రేజ్ అది. ప్రస్తుతం ‘007’ సిరీస్‌లో 25వ చిత్రంగా ‘నో టైం టు డై’ వస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా-లాక్‌డౌన్ పరిస్థితులతో 2021 ఏప్రిల్‌కు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీని తర్వాత బాండ్ సినిమాలు చేయనని ఇప్పటికే డేనియల్ క్రేగ్ ప్రకటించారు. మరి నెక్ట్స్ బాండ్ ఎవరు? అనే దానిపై ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బార్బరా బ్రొకోలీ మాట్లాడుతూ.. తర్వాతి చిత్రంలో బాండ్‌గా నల్లజాతీయుడు గానీ, మహిళ గానీ నటించే అవకాశాలున్నాయని చెప్పారు. ఇప్పటికైతే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తమ దృష్టంతా ‘నో టైం టు డై’ సినిమాపైనే ఉందని తెలిపారు. తర్వాతి బాండ్ ఎవరనే దానిపై ఇప్పటికే హాలీవుడ్‌లో పలుపేర్లు తెరపైకొస్తున్నాయి.
* కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఉదయమంతా ఎండ, పొడి వాతావరణం ఉన్నా, సాయంత్రమైతే చిరు జల్లులతో మొదలై కుంభవృష్టి కురుస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అదే విధంగా తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వివరించింది.
* దేశంలో కరోనా వైరస్ తీవ్రత గరిష్ఠ స్థాయి దాటిపోయిందని కేంద్రం నియమించిన కొవిడ్ ప్రత్యేక కమిటీ ఆదివారం వెల్లడించింది. అన్ని జాగ్రత్త చర్యలు పకడ్బందీగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో కేసుల సంఖ్యను నియంత్రించవచ్చని కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం కరోనా వైరస్‌కు సంబంధించి పలు కీలక విషయాల్ని వెల్లడించింది. దేశంలో కొవిడ్ తీవ్రత, అంచనాలపై కేంద్రం ఐఐటీ, ఐసీఎంఆర్ సభ్యులతో కొవిడ్-19 భారత్ సూపర్ మోడల్ పేరుతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నేతృత్వం వహిస్తున్నారు.
* నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కమార్ తెలిపారు. ఈ నెల 13న కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయని.. వరద ప్రభావంతో 37,409 కుటుంబాలు ముంపు బారిన పడ్డారని చెప్పారు. గుర్రం చెరువుకు వరద వచ్చేందుకు అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల నుంచి 2,100 కుటుంబాలను నిన్న సాయంత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
* యూపీలో భాజపా సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమం కంటే ఆపరాధుల్ని రక్షించే పనులే కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. పరోక్షంగా.. జైల్లో బంధించిన ఓ నిందితుణ్ని భాజపా ఎమ్మెల్యే విడిపించి తీసుకెళ్లిన ఘటనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బేటీ బచావోతో ప్రారంభమైన పథకం.. అపరాధీ బచావో(నేరగాళ్లను రక్షించండి) దిశగా సాగుతోంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
* ఓ క్యాబ్ డ్రైవర్ వేధింపులు భరించలేక ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న కారులోంచి బయట దూకేశారు. ఇది గమనించిన స్థానికులు కారును వెంబడించి అందులో ఉన్న మరో మహిళను రక్షించారు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటుచేసుకుంది. రంజిత్ ఎవెన్యూ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లేందుకు ముగ్గురు మహిళలు ఓ క్యాబ్‌ను మాట్లాడుకున్నారు. అయితే, దారిమధ్యలో క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో క్యాబ్ వేగాన్ని పెంచి తన దుశ్చర్యను కొనసాగించాడు. అతడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు మహిళలు నడుస్తున్న కారులో నుంచి బయటకు దూకేశారు.