టైగర్.. కొద్దిరోజులుగా నల్లమల అటవీ శాఖలో మార్మోగుతున్న పేరు. స్మగ్లర్లు, వేటగాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న పేరు. తమను ఎవరూ పట్టుకోలేరని విర్రవీగుతున్న వారిని ఇట్టే పట్టేస్తూ జైల్లో ఊచలు లెక్కించేలా చేస్తున్న ఉత్తమ జాతి జాగిలమే ఈ టైగర్. నిజ నిర్ధారణకు అవసరమైన సాక్ష్యాలను అటవీ శాఖాధికారులకు అందిస్తూ నల్లమల అభయారణ్యంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ జాగిలం తన సత్తా చాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 9 వేల చదరపు కిలోమీటర్లలో నల్లమల అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ వన్య ప్రాణుల వేటతో పాటు, అడవులను కొల్లగొట్టే ఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అటవీ వైశాల్యం పెద్దది కావటం, సిబ్బంది తక్కువగా ఉండటంతో స్మగ్లర్లు, వేటగాళ్లకు ఎదురులేకుండా పోతోంది. దీంతోపాటు అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు దాడులకు తెగబడుతుండటంతో వీరిని నియంత్రించటం ఆ శాఖకు కష్టంగా మారింది. దీంతో అధికారులు పోలీసు శాఖ తరహాలోనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.
***‘టైగర్’కు ప్రత్యేక సౌకర్యాలు
నిజ నిర్ధారణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ టైగర్‌కు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 22 కేజీల బరువు, 24 అంగుళాల ఎత్తుండే ఈ జాగిలానికి అటవీ శాఖ కార్యాలయంలో ఓ క్వార్టర్‌ను కేటాయించారు. దీనికి ప్రతిరోజూ ప్రత్యేక డైట్ మెనూను అమలుచేస్తుంటారు. ఏటా వ్యాక్సిన్‌లు, డీవార్మింగ్ మాత్రలను వేయిస్తామని శిక్షకుడు సుధాకర్ తెలిపారు.
***జర్మన్ షెపర్డ్‌తో స్మగ్లర్లలో గుబులు
జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ మగ శునకానికి (టైగర్) గ్వాలియర్‌లో శిక్షణను ఇప్పించారు. ఈ శునకం అభయారణ్యంలో కలప స్మగ్లర్లు, వేటగాళ్ల కార్యకలాపాలను అడ్డుకోవటంతో పాటు, పులులు ఇతర వన్య ప్రాణుల కదలికలను పసిగడుతోందని అధికారులు ఈ టైగర్ సేవలను కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది నేరగాళ్లను ఈ ‘టైగర్’ పట్టించింది. ఉదా..
*నంద్యాల డివిజన్ పచ్చర్లలోని రైలు పట్టాల పక్కన 2018 నవంబర్ 17న ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అధికారులు ఈ ‘టైగర్’ సహాయంతో ఘటన కారణాలను ఛేదించారు.
* 2020 జనవరి 16న మం డల పరిధిలో సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వద్ద కుందేళ్లు ఉన్నట్లు ఈ టైగర్ పసిగట్టి నిందితుడ్ని పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించింది.
* అలాగే, ఇదే ఏడాది మార్చి 30న కర్నూల్ జిల్లా నాగటూటి రేంజిలో కొందరు వ్యక్తుల వద్ద కణితి మాంసాన్ని గుర్తించిన ‘టైగర్’ వారిని పట్టించింది. ఆ కేసులో దుండగులకు జైలుశిక్షలు పడ్డాయి.
*ఇదే సంవత్సరం జూలై 21న మండలంలోని సుందరయ్య కాల నీలో బతికున్న రెండు కుందేళ్లతో సంచరిస్తున్న వ్యక్తిని పసిగట్టింది.
*మొన్న ఆగస్టులో హసానాబాద వద్ద అడవిపంది మాంసాన్ని పంచుకుంటున్న వ్యక్తులను కటకటాల పాలయ్యేలా చేసింది.
నల్లమల పరిరక్షకుడు…టైగర్
Related tags :