రక్షణ రంగంలో భారత్ మరో మైలు రాయిని దాటింది. భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కోల్‌కతా శ్రేణి డెస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ చెన్నై’ యుద్ధ నౌక నుంచి విజయవంతంగా ఇవాళ పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌డీవో ట్విటర్‌లో ప్రకటించింది. ఇటీవల బ్రహ్మాస్ క్షిపణుల సామర్థ్యం పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయోగాలు చేపడుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవు.మరోవైపు ఇవాళ ప్రయోగానికి వినియోగించిన ఐఎన్‌ఎస్ చెన్నై 2016 నుంచి తన సేవలు అందిస్తోంది. ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15A లో భాగంగా స్వదేశీయంగా దీనిని అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దీనిని భారతనావికా దళానికి అప్పగించారు. 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ చెన్నై రెండు మల్టీరోల్ కాంబాట్ హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. ఇది గంటలకు 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, దేశీయంగా అభివృద్ధిచేసిన యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు, భారీ టోర్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఈ యుద్ధ నౌకలో ఉంటాయి.
బ్రహ్మోస్ క్షిపణి విజయవంతం
Related tags :