NRI-NRT

అమెరికాలో వీరమహిళ

The inspiring story of Kala Bagai from India whom Berkeley named a street

వందేళ్ల క్రితం వలసవెళ్లి అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయురాలి పేరును అక్కడి బెర్కెలీ సిటీకౌన్సిల్‌ ఇటీవల నగరంలోని ఒక వీధికి పెట్టింది. కళా బగాయ్‌ అనే ఆ మహిళకు అరుదైన ఈ గౌరవం లభించడం వెనక పెద్ద కథే ఉంది.కళ అమృత్‌సర్‌లో పుట్టింది. ఆమె భర్త వైష్ణోదాస్‌ భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతిస్తున్న గదర్‌ పార్టీలో సభ్యుడు. పార్టీ పిలుపు మేరకు తన ఆస్తినంతా అమ్ముకుని భార్యాబిడ్డలతో 1915లో అతడు అమెరికా చేరాడు. బెర్కెలీలో సొంతిల్లు కొనుక్కున్నాడు. తెల్లవారు కానివారు తమ పొరుగున ఉండడం ఇష్టంలేని స్థానికులు ఆ ఇంటికి తాళం వేశారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం ఎలాగో తెలియని కళ దంపతులు మరో నగరంలో కిరాణాదుకాణం పెట్టుకుని బతికేవారు. కొన్నాళ్లకి వారికి అక్కడి పౌరసత్వం కూడా ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ రద్దుచేశారు. దాంతో దుకాణాన్నీ తీసేయాల్సివచ్చింది. ఈ అవమానాలన్నీ భరించలేక కళ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కష్టపడి ముగ్గురు కొడుకుల్నీ చదివించుకున్న కళకి ఆ తర్వాత చట్టాలు మారడంతో పౌరసత్వమూ లభించింది. ఆరోజుల్లో అమెరికాలో జాతివివక్ష ఎక్కువగా ఉండేది. పలు అనుభవాలతో రాటుదేలిన కళ పొట్ట చేతపట్టుకుని వలసవచ్చిన ఆసియా ప్రజలకు అండగా నిలిచింది. చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ వివక్షకు వ్యతిరేకంగా వారి తరఫున పోరాడింది. ఉద్యోగం దొరికేదాకా ఎందరికో తన ఇంట ఆశ్రయమిచ్చింది. అలా ఆమె ఇల్లు ఆసియన్ల హక్కుల పోరాట కేంద్రంగా మారింది. వారంతా ప్రేమగా ‘మదర్‌ ఇండియా’ అని పిలుచుకున్న కళ 1983లో మరణించింది. వందేళ్ల క్రితం ఏ వీధిలోనైతే కళకు అవమానం జరిగిందో ఆ వీధికే ఆమె పేరుని పెట్టాలనుకోవడం ద్వారా ఆమెని గౌరవించడమే కాదు, ఒకప్పటి తమ జాత్యహంకార చరిత్రని నిరసిస్తున్నామనీ అక్కడి అధికారులు పేర్కొనడం విశేషం