* దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో అధికార పార్టీ నాయకులపై భాజపా నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెరాస సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా విజయం తెరాసదేనని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. భాజపా గోబెల్స్ ప్రచారానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోందని దుయ్యబట్టారు. ఎదుటి పార్టీలు చేసినవి కూడా తామే చేశామని చెప్పుకుంటున్నారని చెప్పారు. దుబ్బాక ప్రజలంతా తిరగబడుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు.బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లలో రూ.1600 మోదీ గారు ఇస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారని హరీశ్‌రావు తప్పుబట్టారు. వారికిచ్చే పెన్షన్లలో ఒక్క పైసా కూడా కేంద్రం వాటా లేదని స్పష్టంచేశారు. రూ.1600 ఇచ్చేది వాస్తవమే అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రి పదవికి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీశ్ రావు అన్నారు. ఒకవేళ నిరూపించకపోతే కరీంనగర్ ఎంపీ పదవికి, భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. రాష్ట్రానికి ఏదైనా చేశాకే మాట్లాడాలని భాజపా నేతలకు సూచించారు. ఎవరేం చేసినా నిజామాబాద్, హుజూర్‌నగర్ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమా వ్యక్తంచేశారు.
* ప్రధాని మోదీపై ప్రజలకున్న నమ్మకం వల్ల భాజపాకు మాత్రమే కాకుండా మిత్రపక్ష పార్టీలకూ మేలు కలుగుతుందని బిహార్ భాజపా ఎన్నికల బాధ్యుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్షాలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్నాలో ఎన్డీయే కూటమి నేతలతో ఫడణవీస్ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. ‘‘బిహార్‌లో ఎక్కడికెళ్లినా, మోదీ పేరు చెప్పినా విశేష స్పందన కనిపిస్తోంది. దేశ ప్రజానీకం మోదీపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. దీని వల్ల కేవలం పార్టీకే కాదు.. మిత్రపక్షాలకు కూడా లాభం చేకూరుతుంది’’అని దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.
* ఇసుక తవ్వకం, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావుండొద్దని సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. నూతన ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని, ధర కూడా తక్కువగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన నూతన ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.వినియోగదారులకు నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని సీఎం జగన్ అన్నారు. ఇసుక రీచ్‌ల సామర్థ్యం పెంచితే పెద్ద కంపెనీలు వస్తాయన్నారు. ఎవరైనా వచ్చి చలానా కట్టి ఇసుక తీసుకెళ్లేలా విధానం ఉండాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాలు, ప్రాంతాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలన్నారు. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఎస్‌ఈబీ పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. గుత్తేదారు ప్రత్యామ్నాయ రవాణా వసతి కూడా కల్పించాలన్నారు. నియోజకవర్గంలో నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు విక్రయించేందుకు వీల్లేదని చెప్పారు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు రాయితీపై ఇసుక సరఫరా చేయాలన్నారు. రాయితీ ఇసుకను ఎంతదూరం వరకు సరఫరా చేయొచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
* భాగ్యనగరంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వర్షాలు, వరదనీటి ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10వేలు చొప్పు ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వర్షాల వల్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న రహదార్లు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడాలని వరదలపై నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.
* భాగ్యనగరంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు వరదలపై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరదల కారణంగా హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంత ప్రజలు ఎన్నో అష్టకష్టాలకు గురయ్యారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు.
* వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఉదయం జగ్గయ్యపేట చేరుకున్న ఆయనకు తెదేపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగ్గంపేట మండలం రామవరం నుంచి తన పర్యటనను ప్రారంభించిన లోకేశ్.. వరదలకు కూలిన ఇళ్లు, ముంపులో ఉన్న పొలాల్ని పరిశీలించారు. అనంతరం కిర్లంపూడి మండలం గోనెడలో ఏలేరు వరద ముంపులో ఉన్న పంట పొలాల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.
* జమ్మూకశ్మీర్‌ను చైనాలో భాగంగా చూపించి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ వివాదంలో చిక్కుకుంది. లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతంలో ఉన్న యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఓ పాత్రికేయుడు ట్విటర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ భద్రత వ్యవహారాల విశ్లేషకులైన నితిన్ గోఖలే అమరవీరుల చిహ్నమైన హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి ట్విటర్ వేదికగా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో ట్విటర్ వీడియోలో లొకేషన్ ట్యాగ్ ‘జమ్మూకశ్మీర్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’గా దర్శనమిచ్చింది. గోఖలేతో పాటు ఇతర ట్విటర్ యూజర్లు వెంటనే ఆ తప్పును గుర్తించారు. ట్విటర్, ట్విటర్ ఇండియా అధికార ఖాతాల్లో దాన్ని ఎత్తిచూపారు.
* జార్జియా రాష్ట్రంలోని మెకాన్ నగరంలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో.. డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ పేరును.. రిపబ్లిక్ పార్టీ సెనేటర్ డేవిడ్ పెర్‌డ్యూ తప్పుగా సంబోధించిన సంగతి తెలిసిందే. ‘‘కాహ్-మా-లా? కాహ్-మాహ్-లా? కమలా-మలా- మాలా? ఏదో నాకు తెలియదు.. ఏదైనా కానీయండి..’’ అంటూ వేలాది మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఆయన అనటం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విధమైన ప్రవర్తనను కమల మద్దతుదారులే కాకుండా పలువురు భారతీయ అమెరికన్లు ఖండిచారు.
* ఆమె ఓ విద్యాకుసుమం. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే ఆమె ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యాచకురాలిగా జీవనం సాగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు అంగ్లంలో పట్టభద్రురాలైన హన్సీ ప్రహారి అక్కడే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. అక్కడి గ్రంథాయంలో ఉద్యోగం చేస్తుండేవారు. వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాల కారణంగా తీవ్ర విషాదంలో మునిగిపోయిన హన్సీ ప్రస్తుతం హరిద్వార్‌లోని రైల్వే స్టేషన్, బస్టాండు, గంగా తీరంలోని ఘాట్‌లలో భిక్షమెత్తుకుంటున్నారు. ఆమె గతంలో.. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్ టమ్‌టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమెకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆమెతోనే వీధుల వెంటే జీవిస్తున్నాడు.
* ఇన్‌స్టంట్ ఫుడ్ తినడం అలవాటైన రోజులివి. అందుకే మొబైల్ ఛార్జింగ్ విషయంలోనూ యూజర్లు వేగం కోరుకుంటున్నారు. భారీ బ్యాటరీ ఉన్నా నిమిషాల్లో ఛార్జింగ్ ఫుల్ అవ్వాలని ఆశిస్తున్నారు. దీంతో చాలా సంస్థలు ఫాస్ట్ ఛార్జర్లను రంగంలోకి దించాయి. ఈ క్రమంలో షావోమి ఓ ఫాస్ట్ ఛార్జర్‌ను సిద్ధం చేసింది. షావోమీ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్లను తీసుకురావడం కొత్తేమీ కాదు. గతంలో 50 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ ఛార్జర్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసింది. ఇప్పుడు 80 వాట్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్‌ను రూపొందించింది. ఇది 4,000 బ్యాటరీని 19 నిమిషాల్లో పూర్తి ఛార్జి చేసింది.
* పౌరాణిక, జానపద చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే అతికొద్దిమంది నటుల్లో అలనాటి నటుడు ఎన్టీఆర్ ఒకరు. ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తనయుడు బాలకృష్ణ కూడా ఈ జానర్ సినిమాల్లో అందెవేసిన చేయి. సుదీర్ఘ సంభాషణలను సైతం అలవోకగా చెప్పేస్తారు బాలయ్య. దసరా పండగ రోజు ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వన్నట్లు ప్రకటించారు. ఆయన కీలక పాత్రల్లో స్వీయ దర్శకత్వంలో మొదలైన చిత్రం ‘నర్తనశాల’. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన షూటింగ్ కొద్దిరోజులకే ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను అభిమానుల కోసం విడుదల చేయనున్నట్లు తెలిపారు.
* దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 448 పాయింట్లు లాభపడి, 40,431 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 11,873 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.37గా ఉంది. ఉదయం స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 82 పాయింట్లతో ముందుకు కదలాడింది.ఫైనాన్షియల్, మెటల్ షేర్ల అండతో ఒకానొక దశలో సెన్సెక్స్ 40,519 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకగా, చివరకు 448 పాయింట్ల లాభంతో 40,431 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11,850 పాయింట్ల మార్కుపైనే ముగిసింది.
* లాకప్‌లో పోలీసులు తనపై పది రోజులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళ ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని జైలులో ఉన్నారు. హత్య కేసుకు సంబంధించి తనను ఈ ఏడాది మేలో అరెస్టు చేసిన పోలీసులు అదే నెల 10వ తేదీ నుంచి 21 వరకూ తమ కస్టడీలో ఉంచుకొని అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. తనకు రక్షణగా ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను ఈ విషయం ఎవరికీ చెప్పొదంటూ వాళ్లు బెదిరించారని మహిళ వివరించారు.
* కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు పనిచేయవని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుపై ట్విటర్ చర్యలు తీసుకొంది. ఆయన చేసిన పోస్టును తొలగించింది. కరోనావైరస్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు స్కాట్ అట్లాస్ ఆగస్టులో శ్వేతసౌధంలో సలహాదారుగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయన ‘మాస్కులు పనిచేస్తాయా? లేదు’ అంటూ ట్వీట్ చేశారు. వాటి విస్తృత వినియోగానికి మద్దతు లేదన్నారు. ఈ ట్వీట్ కొవిడ్-19 గురించి తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తికి దోహదం చేస్తోందని, ఇది తమ సంస్థ విధానానికి విరుద్ధమంటూ ట్విటర్ దానిపై తొలుత తప్పుడు సమాచారం అనే ట్యాగ్ ఇచ్చింది. ఆదివారం ఆ ట్వీట్‌ను పూర్తిగా తొలగించింది.