Business

మరో మారుతీ స్విఫ్ట్ వస్తోంది-వాణిజ్యం

మరో మారుతీ స్విఫ్ట్ వస్తోంది-వాణిజ్యం

* చైనా ఆర్థిక వృద్ధి రేటు వేగంగా పుంజుకుంటోందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో క్రితం సంవత్సరంతో పోలిస్తే దేశ జీడీపీలో 4.9శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. కరోనా మహమ్మారితో తొలుత వణికిపోయిన దేశం క్రమంగా బలపడుతోందని అభిప్రాయపడింది. మార్చిలోనే కరోనాను కట్టడి చేశామని ప్రకటించిన చైనా.. క్రమంగా ఫ్యాక్టరీలు, కార్యాలయాలను తెరుస్తూ వచ్చింది. మాస్కులతో పాటు ఇతర వైద్య సామగ్రికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరగడంతో చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలు వెంటనే ఊపందుకున్నాయి. రిటైల్‌ విక్రయాలు సైతం మహమ్మారి మునుపటి దశకు చేరుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే రిటైల్‌ సేల్స్‌లో ఒక శాతం వృద్ధి రేటు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో ఇది 7.2 శాతానికి దిగజారింది. ఒక్క సెప్టెంబరులో విక్రయాలు 3.3 శాతం పుంజుకున్నాయి.

* దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 448 పాయింట్లు లాభపడి, 40,431 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 11,873 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.37గా ఉంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రీ మార్కెట్‌ నుంచే సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 9.33 సమయంలో సెన్సెక్స్‌ 318 పాయింట్లు పెరిగి 40,301 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు లాభంతో 11,844 వద్ద ట్రేడవుతున్నాయి. ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేట్‌, దేవాన్‌ హౌసింగ్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉండగా..సౌత్‌ఇండియన్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, పీవీఆర్‌ లిమిటెడ్‌, శిల్పమెడికేర్‌ వంటివి నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన రంగాలకు చెందిన సూచీలన్నీ సానుకూలంగానే ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ షేర్లు లాభల్లో ఉండటంతో సూచీలు పరుగులు పెడుతున్నాయి. నేడు 21 కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏసీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ వంటి కంపెనీలు వీటిల్లో ఉన్నాయి.

* భారత్‌లో స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిస్తూ విదేశీ వస్తువుల దిగుమతికి ముగింపు పలకాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎగుమతులను పెంచాలని ఆయన సూచించారు. ఇందుకోసం ‘దిగుమతుల ప్రత్యామ్నాయం, ఎగుమతుల ఆధారిత విభాగాన్ని’ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశం చేయడంతో పాటు కేవలం స్వదేశీ, స్వావలంబన సూత్రంపైనే ఈ విభాగం పూర్తిగా పనిచేయాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ‘స్వదేశీ జాగరణ్‌ మాంచ్’ అనే‌‌ సంస్థ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్‌ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

* మారుతీ సుజుకీ గత 14 ఏళ్లలో 23 లక్షల స్విఫ్ట్‌ మోడల్‌ కార్లను విక్రయించింది. దీన్ని పురస్కరించుకొని సంస్థ ఈ పండగ సీజన్‌కు కొన్ని అత్యాధునిక హంగులతో లిమిటెడ్‌ వెర్షన్‌ స్విఫ్ట్‌ను విడుదల చేసింది. బోల్డ్‌ అపీల్‌ ఉండేలా ఎక్స్‌టీరియర్స్‌కు బ్లాక్‌ యాక్సెసరీస్‌ని జోడించింది. సాధారణ మోడల్‌తో పోలిస్తే వీటి ధర రూ.24,990 అదనం. అలాగే అన్ని వెర్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది.