Devotional

బ్రహ్మోత్సవాల్లో రకాలు

బ్రహ్మోత్సవాల్లో రకాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండువగా జరుగుతాయి. ‘నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’ అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.
**నిత్య బ్రహ్మోత్సవం
ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి మూడురోజులుగానీ అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి.
**శాంతి బ్రహ్మోత్సవం
కరవు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి ‘శాంతి బ్రహ్మోత్సవాలు’. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి.
**శ్రద్ధా బ్రహ్మోత్సవాలు
ఎవరైనా భక్తుడు, తగినంత ధనాన్ని దేవస్థానంలో, దైవసన్నిధిలో సమర్పించి, భక్తిశ్రద్ధలతో జరిపించుకొనేది ‘శ్రద్ధా బ్రహ్మోత్సవం’. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను ‘ఆర్జిత బ్రహ్మోత్సవాలు’గా పేర్కొంటున్నారు.
**ఒకరోజు బ్రహ్మోత్సవం
రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు. చక్రస్నానానంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిస్తారు. సప్తాశ్వాల, సప్తమి నాటి, సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది.
*స్వామివారి బ్రహ్మోత్సవాలు ‘అంకురార్పణ’తో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి ముందురోజుగానీ మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిదిరోజుల ముందుగానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు, ఆలయంలో నైరుతిథిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే ‘మత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే ‘అంకురార్పణ’ అయింది