హైదరాబాద్ నగరవాసులను వరుణుడు వెంటాడుతున్నాడు
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన భాగ్యనగరం ఇంకా తేరుకోకముందే మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు.
తాజాగా నగరంలోని పలుచోట్ల వర్షం మళ్లీ మొదలైంది.
మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చార్మినార్, సుల్తాన్ బజార్, కోఠి, ఖైరతాబాద్, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ నగరంలో ఇవాళ మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో హైదరాబాద్ నగరపాలక సంస్థ అప్రమత్తమైంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విభాగాలను, పోలీసులను అప్రమత్తం చేసింది.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
ఇటీవల పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మరోవైపు ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని వందల కాలనీలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి.
ఇవాళ మరోసారి భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటని నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
దీంతో లోతట్టుప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
జంటనగరాల్లోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.
పోలీసుల సాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.
దీంతో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను యుద్ధప్రాతిపదికన కమ్యూనిటీ హాళ్లకు తరలిస్తున్నారు.