ఎన్ని చుక్కలున్నా చంద్రుడు లేని ఆకాశం బోసిపోయినట్టే ఉంటుంది. ఎన్ని నగలున్నా చంద్రహారం లేకపోతే మగువల అలంకారానికి ఓ వెలితే! నెలవంక నమూనాలో తీర్చిదిద్దుతారు కాబట్టి.. ఈ నగకు చంద్రహారం అన్న పేరు వచ్చింది. మెడ నుంచి నాభి వరకూ.. వయ్యారంగా వేలాడుతూ ఆభరణాల్లో రాణెమ్మ స్థానాన్ని అందుకుంది చంద్రహారం. పెద్దలు దీనికి పెట్టుకున్న ముద్దుపేరు.. పెద్ద గొలుసు!
*ఆధ్యాత్మిక సౌందర్యం
చంద్రహారం భౌతికమైన అలంకరణకు పరిమితమైన నగ కాదు. అంతర్లీనంగా ఆధ్యాత్మిక సౌందర్యమూ ముడిపడి ఉంటుంది. మెడ నుంచి కిందికి వేలాడుతూ.. నాభి ప్రాంతంలో రాపిడి జరగడం వల్ల స్వాధిష్టాన చక్రం చైతన్యమంతం అవుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. కాబట్టే, చంద్రహారం ధరించేవారి జీవితాలలో ఆనందం, శాంతి పరిపూర్ణంగా ఉంటాయని ఓ విశ్వాసం.
*బెంగాలీ స్పెషల్
బెంగాలీల ‘చంద్రహారం’ వైవిధ్యంగా కనిపిస్తుంది. భారీ పూల లాకెట్టుకు క్రిస్స్-క్రాస్ బంగారు తీగలతో అదనపు శ్రేణిని కలిగి ఉంటుంది. పెండెంట్ మధ్య చిన్నచిన్న పూల ఆకారాలు ఉంటాయి. ఈ నగను ధరించే తీరు భిన్నంగా ఉంటుంది. బెంగాలీలు చంద్రహారాన్ని నడుము నుంచి కటి వరకు ధరిస్తారు. దీన్ని వివాహ సమయంలో సీతాదేవి సింగారించుకున్నదని చెబుతారు. బెంగాలీ నవ వధువుకు పుట్టింటివారు బహుమతిగా ఇస్తుంటారు.
*కొత్త పుంతలు
చంద్రహారం తరాలనాటి ఒరవడిని ఎప్పుడో దాటేసింది. ఆ పెద్ద గొలుసు సంప్రదాయ దుస్తులతో అలంకరించుకునే భారీ నగ మాత్రమే కాదిప్పుడు. తక్కువ బంగారంతో చిన్నచిన్న డిజైన్లతో తయారు చేసి… అన్ని రకాల దుస్తులకూ నప్పేలా తీర్చిదిద్దుతున్నారు.
*ఆరు వరుసల్లో..
ఇందులో ఆరు వరుసల్లో చంద్ర వంకలను అనుసంధానం చేసిన గొలుసులు ఉంటాయి. అయితే, ఆ గొలుసు కాస్త సుకుమారంగా ఉంటుంది. ఆరు వరుసల గొలుసులను… భుజం దగ్గర కుడి వైపు కనిపించేలా వరుసగా ఉన్న మూడు పువ్వుల లాకెట్‌కు అనుసంధానం చేస్తారు. ఈ లాకెట్‌లో పచ్చలు, కెంపులు, అమెరికన్ డైమండ్స్ పొదగటం వల్ల మరింత అందం వస్తుంది. చిన్నచిన్న పార్టీల నుంచి వివాహాల వరకు అన్ని సందర్భాల్లోనూ అలంకరించుకోవచ్చు.
*మూడు తీగలచంద్రహారం
ఈ తీరులో చిన్నచిన్న బంగారు బంతులను మూడు తీగల్లో కడతారు. దీన్ని మూడు తీగల చంద్రహారం అంటారు.కానీ, పతకం స్థానంలో రెండు వైపులా కోడిగుడ్డు ఆకారపు లాకెట్లు ఉంటాయి. ఆభరణాలపై వజ్రాలు, కెంపులు వాడతారు. ఆ కాంబినేషన్ మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది
*గాజులూ, చెవి పోగులతో..
చంద్రవంకలా ఉండే సన్నని రింగులను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి కూడా చంద్రహారాన్ని రూపొందిస్తారు. ఇలా తయారు చేసిన గొలుసులను రెండు మూడు వరుసలలో కూర్చి.. భారీ లాకెట్‌ను జోడిస్తారు. నెలవంక ఆకారంలో ఉండటం దీని ప్రత్యేకత. అందుకే చాలా ఘనంగా కనిపిస్తుంది. జతగా గాజులు, డాంగల్ చెవిపోగులు కూడా ధరిస్తే.. శరత్ చంద్రిక అయినా చిన్నబోవాల్సిందే.
*రాళ్ల చంద్రహారం
తక్కువ ఖర్చులో చంద్రహారాన్ని సొంతం చేసుకోవాలని అనుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. క్యూబిక్ జిర్కోనియా (సీజెడ్)ను పొదగడంతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సీజెడ్ రాళ్లు వజ్రాలను తలపిస్తాయి.
*ముత్యాల చంద్రహారం
ముత్యాలను బంగారు తీగతో అల్లిన గొలుసులనే.. ముత్యాల చంద్రహారాలుగా అభివర్ణిస్తారు. ఆ గొలుసులను.. చిన్నచిన్న వజ్రాలు పొదిగిన లాకెట్‌కు అనుసంధానం చేస్తారు. వెన్నెల రంగులో నిండైన చంద్రకాంతులను వెదజల్లే ఈ హారం అందానికే అందమై నిలుస్తుంది.
*అచ్చమైన చంద్రహారం
చంద్రహారం అనే మాటకు అచ్చమైన బంగారు గొలుసే పరిపూర్ణ నిర్వచనం. ఇందులోని లాకెట్ సాదాసీదాగా ఉంటుంది. సంప్రదాయ చంద్రహారంలో ఎలాంటి రాళ్లనూ పొదగరు.
చంద్రహారం అంటే ఏమిటి?
Related tags :