అనేక విమర్శలు, వివాదాల అనంతరం విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ‘800’ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. స్పిన్ మాంత్రికుడు, శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందాల్సిన బయోపిక్ ఇది. ఇటీవల తమిళంలో ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే గతంలో మురళీధరన్ ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యల కారణంగా ‘800’లో విజయ్ నటించడాన్ని కొన్ని వర్గాలు తప్పుపట్టాయి. దీంతో ఈ చిత్రం రాజకీయంగా వివాదంలో చిక్కుకుంది. తమిళనాడుకు చెందిన అనేక రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ‘విజయ్ సేతుపతి.. నీ పట్ల సిగ్గుపడుతున్నాం’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
దీనిపై మురళీధరన్ ఇటీవల స్పందిస్తూ.. ‘నేను జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. క్రికెట్లో నిలదొక్కుకొని ఏవిధంగా విజయం సాధించాననే విషయాన్ని ఈ చిత్రంలో చూపిస్తారు. శ్రీలంకలో తమిళుడిగా జన్మించటం నా తప్పా? నేను శ్రీలంక క్రికెట్ జట్టులో సభ్యుణ్ని. అందువల్ల నేను కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అనేక కారణాల వల్ల రాజకీయం చేస్తున్నారు. నేను మారణ హోమానికి మద్దతు ఇచ్చానని ఆరోపణలు చేస్తున్నారు. నేను 2009లో తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను..’ అని వివరణ ఇచ్చారు.
అయినా సరే విమర్శలు ఆగకపోవడంతో.. సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోన్న విజయ్ కెరీర్ ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతో తన సినిమా నుంచి తప్పుకోమని ముత్తయ్య మురళీధరన్ తాజాగా కోరారు. ‘నా బయోపిక్ వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో నేను ఈ ప్రకటన చేస్తున్నా. విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘800’ సినిమా నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ నటుడి కెరీర్‌ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఇందులో నటిస్తే ఆయనకు భవిష్యత్తులోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని విజయ్ సేతుపతిని కోరుతున్నా’.
‘నేను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. నా బయోపిక్ యువతలో స్ఫూర్తినింపుతుందని భావించా. కానీ అది ఆగిపోయింది. దర్శక, నిర్మాతలు సమస్యల్ని పరిష్కరించి, సినిమాను ప్రేక్షకులకు చేరవేస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుంది. నిర్మాతల నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి విజయ్ స్పందిస్తూ.. ‘థాంక్యూ.. గుడ్‌బై’ అని ట్వీట్ చేశారు.