దివంగత సీఎం జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీ నిగ్గుతేల్చడంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు చిత్తశుద్ధి లేదని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మండిపడ్డారు. ఆ ఇద్దరు ఆడుతున్న నాటకం ఓ లేఖ ద్వారా బట్టబయలైనట్టు ఆరోపించారు. జయలలిత మృతి మిస్టరీని నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతోంది. ఇంత వరకు ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. ఈనెల 24వ తేదీతో పొడిగించిన గడువు కూడా ముగియంది. మరో 3 నెలలు గడువు పొడిగించాలని ఆర్ముగస్వామి కమిషన్ ప్రభుత్వానికి ఓ లేఖ రాసి ఉండడం ఆదివారం వెలుగులోకి వచ్చింది.
ఈ లేఖలో కొన్ని అంశాలు, ప్రభుత్వ న్యాయవాదుల తీరుపై కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న స్టాలిన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. జయలలిత మృతిచెంది నాలుగేళ్లు కావస్తోందని, ఆమె మరణంపై అనేక అనుమానాలు ఉన్నా, అవి ఇంతవరకు నివృతి కాలేదని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మరణం మిస్టరీని నిగ్గుతేల్చడంలో సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీరు సిద్ధంగా లేదన్నది తాజా లేఖ స్పష్టం చేస్తున్నట్టుందని అనుమానం వ్యక్తంచేశారు. ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పడి 37 నెలలు అవుతోందని, ఇంత వరకు ఎలాంటి నివేదిక ప్రభుత్వానికి చేరలేదని గుర్తు చేశారు.