కొవిడ్-19 ప్రభావంతో ప్రతి ఒక్కరూ శుభ్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ వంతుగా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారు. కానీ ఎప్పుడూ చేతిలో ఉండే మొబైల్‌ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్‌పై ఉండే వైరస్‌ను నిర్మూలించడం ఎలా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో వస్తోంది. శానిటైజర్‌తో శుభ్రం చేద్దామంటే స్మార్ట్ గ్యాడ్జెట్స్ పాడైపోతాయనేది నిపుణల మాట. అందుకే మొబైల్‌ఫోన్, ఇయర్ ఫోన్స్, వాచ్, కళ్లజోడు లాంటి వాటిని శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా యూవీ (అల్ట్రా వయోలెట్) స్టెరిలైజర్ బాక్స్‌ను శాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో యూవీ లైటింగ్ ఫీచర్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. మరి అది ఎలా పనిచేస్తుంది? ఏ మేరకు క్రిముల్ని నాశనం చేస్తుంది? తదితర అంశాలను తెలుసుకుందామా!
సూర్యుడి నుంచి కిరణాల రూపంలో ప్రసరించే ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్‌ను యూవీ లైట్ అంటారు. అయితే ప్రత్యేకమైన బల్బ్ సహాయంతో ఈ యూవీ లైట్‌ను కృతిమంగా సృష్టించవచ్చు. యూవీ రేడియేషన్‌లో మొత్తం మూడు రకాలుంటాయి. అవి యూవీ-ఏ, యూవీ-బీ, యూవీ-సీ. వీటిలో యూవీ-సీ సూక్ష్మక్రిములను నాశనం చేయడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. అందుకే ఆస్పత్రుల్లో స్టెరిలైజేషన్ కోసం ఎక్కువగా యూవీ-సీ లైట్‌ను ఉపయోగిస్తుంటారు.
ముందుగా చెప్పినట్లు ఈ బాక్స్ రెండు రకాలుగా పనిచేస్తుంది. స్టెరిలైజర్, వైర్‌లెస్ చార్జర్. బాక్స్ లోపల రెండు వైపులా యూవీ లైట్స్ ఉంటాయి. బాక్స్ మధ్యలో 10 వాట్ బిల్ట్-ఇన్ వైర్‌లెస్ ఛార్జర్ ఉంటుంది. ఈ బాక్స్‌తో పాటు శాంసంగ్ యుఎస్‌బీ-సీ, యుఎస్‌బీ-ఏ కేబుల్స్ ఇస్తున్నారు. ఫోన్ స్టెరిలైజ్ చేయడానికి బాక్స్ మూత ఓపెన్ చేసి అందులో ఫోన్ ఉంచి మూసేయాలి. తర్వాత ఆన్ బటన్ ప్రెస్ చేస్తే బీప్ శబ్దం వినపడి బటన్ పక్కన గ్రీన్ కలర్ బల్బ్ వెలుగుతుంది. అంటే స్టెరిలైజేషన్ ప్రాసెసర్ స్టార్ట్ అయిందని అర్థం. పది నిమిషాల తర్వాత రెండు సార్లు బీప్ శబ్దం వినపడుతుంది. అప్పుడు స్టెరిలైజేషన్ ప్రాసెస్ పూర్తయినట్లు. అప్పుడు బాక్స్ మూత ఓపెన్ చేసి అందులో మొబైల్‌ని వాడుకోవచ్చు. మొబైల్ మాత్రమే కాదు వాచ్, ఇయర్ ఫోన్స్, కళ్లద్దాలు, తాళాలు వంటి చిన్న చిన్న యాక్ససెరీస్‌ను స్టెరిలైజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫోన్లు పట్టేలా దీన్ని తయారుచేశారు.
ఇది 99 శాతం క్రిములను నాశనం చేస్తుందని శాంసంగ్ తెలిపింది. నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కూడా కరోనా వైరస్‌ని నాశనం చేయడంలో యూవీ-సీ లైట్ సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది. అయితే ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) మాత్రం యూవీ-సీ లైట్ కరోనా వైరస్‌ని సమర్ధవంతంగా నాశనం చేస్తుందనడానికి ఆధారాలు లేవని తెలిపింది. శాంసంగ్ యూవీ స్టెరిలైజర్ బాక్స్ ధర రూ. 3,599.