తెలుగు రాష్ట్రాల్లో వరి గడ్డి ప్రధానమైన పశుగ్రాసం వరి గడ్డిని ఎండబెట్టి వాముగా వేసి వేసవిలో పశువుల మేతగా వాడుట సహజం. కానీ వరి గడ్డి పోషక పదార్థాల రీత్యా పాల దిగుబడికి అంత దోహదకారి కాదు. అంతేకాక వరి గడ్డిలో పశువు శరీరంలో ఉండే ముఖ్యమైన లవణ ధాతువు కాల్షియంను నష్టపరిచే లక్షణం ఉంది. వరి గడ్డిలో మాంసకృత్తులు లేవు. జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు కేవలం 45% ఉన్నాయి. కాబట్టి వరిగడ్డిని సుపోషకం చేయటం అవసరం. వరి గడ్డిని సుపోషకం చేయడానికి యూరియాని వాడుతారు. ఈ పద్ధతిని ‘యుటిపిఎస్’ అని కూడా అంటారు.
**వరి గడ్డిని యూరియాతో సుపోషకం చేసే పద్ధతి:
ఒక రోజుకు ఒక పాడి పశువుకు 6 కేజీల సుపోషకం చేసిన వరి గడ్డిని ఆహారంగా ఇవ్వవచ్చు. దీని ప్రకారం ఒక పశువుకు ఒక వారానికి దాదాపు 50 కేజీల సుపోషకం చేసిన వరి గడ్డి అసవరమవుతుంది. రెండు పద్ధతులతో వరి గడ్డిని యూరియాతో సుపోషకం చేయవచ్చు. 100 కిలోల వరి గడ్డికి, 4 కిలోల యూరియా 60 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. మొదట యూరియాను నీళ్లలో బాగా కరిగేటట్లు చూడాలి. తరువాత వరి గడ్డిని నేల మీద పరచి యూరియా కరిగిన నీళ్లను గడ్డిపై పూర్తిగా తడిచేలా చల్లాలి. తరువాత యూరియా నీటితో తడిపిన గడ్డిని పాతర గోతిలో గాని, యూరియా బస్తాలలలో గాని లేదా ప్లాస్టిక్ షీట్‌తో గానీ గాలి చొరబడకుండా జాగ్రత్తగా భద్రపరచి వారం రోజుల పాటు మాగనిస్తే వరి గడ్డి వాడకానికి సిద్ధం అవుతుంది.
***వరి గడ్డిని సుపోషకం చేయడం వల్ల లాభాలు
1 వరి గడ్డిలో ఉండే పీచు పదార్థం తగ్గి పశువులు ఎక్కువ మేతను తినగలవు, జీర్ణం చేసుకోవడం కూడా సులభం.
2 ఈ పద్ధతిలో వరి గడ్డిలో మాంసకృత్తులను 0 నుంచి 5% పెంచవచ్చు.
3 వరి గడ్డిలో ఉండే జీర్ణమవదగ్గ ఆహార పదార్థాలు 45% నుంచి 60% పెరుగుతాయి.
4 ఎండు వరి గడ్డిలో తేమ శాతం 10% ఉండి తినడానికి ఇబ్బంది ఉంటుంది. సుపోషకం చేయడం వలన తేమను 45–50% పెంచవచ్చు.
5 యూరియాతో సుపోషకం చేయటం వలన తక్కువ ఖర్చుతో మాంసకృత్తులను పొందవచ్చు.
6 ఈ పద్ధతి పాడి రైతులు అమలు చేయడానికి అనువైనది, సులభమైనది.
7 సుపోషకం చేయబడిన గడ్డి రంగు ముదురు గోధుమ రంగుగా మారి కొద్దిగా అమ్మోనియా వాసన వస్తుంది. ఈ గడ్డి వాడకం వలన పొల ఉత్పత్తి, పని చేసే శక్తి పెరుగుతాయి.
కొన్ని పశువులు మొదట ఈ గడ్డిని తినడానికి ఇష్టపడకపోవచ్చు. అటువంటి వాటికి కొద్దికొద్దిగా మేపి అలవాటు చేయాలి. పశుపోషణలో పచ్చిమేత, దాణా ఎంత ముఖ్యమో.. వాటి ద్వారా ఖనిజ లవణాల లభ్యత కూడా అంతే ముఖ్యం. అంతేగాక పాడి పశువుల పాల ఉత్పత్తి స్థాయితో పాటు వాటి శరీర కార్యక్రమాలను నిర్వర్తిస్తూ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరమైనంత ఖనిజ లవణాలను అందించడం కూడా అంతే ముఖ్యం.
వరిగడ్డిని మరింత పౌష్ఠికంగా చేయడం ఎలా?
Related tags :