* పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.15.400 కోట్లకు మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీ నుంచి ఇప్పటివరకూ ఆ బ్యాంకు ఒక్క పైసా కూడా రికవరీ చేయలేకపోయింది. సమాచార హక్కు చట్టం ద్వారా జితేంద్ర ఘాగ్డే అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్వయంగా ఆ బ్యాంకే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కేసులో నీరవ్, చోక్సీకి చెందిన విలువైన పెయింటింగ్స్‌తోపాటు కొన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. వీటిని వేలం వేయడంతో వచ్చిన రూ.60 కోట్లను కోర్టు ఆదేశం మేరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టినట్టు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆస్తులపై హక్కును పొందేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధిత కోర్టును ఆశ్రయించేందుకు వీలున్నదని ఓ అధికారి తెలిపారు. ఈ ఆస్తులతోఇదే కేసులో ఈడీ సీజ్ స్వాధీనం చేసుకున్న రూ.1000 కోట్ల ఆస్తులపై హక్కును పొందేందుకు ఆ బ్యాంకు ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చని ఆ అధికారి చెప్పారు.
* పండుగ సమయాల్లో రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించే దిశగా దక్షిణ-పశ్చిమ రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఫలితంగా రూ.10 గా ఉన్న టికెట్ ధర రూ.50 కానుంది.అయితే ఈ నిర్ణయాన్ని కేవలం 13 స్టేషన్లకు మాత్రమే పరిమితం చేశారు రైల్వే అధికారులు.పెరిగిన ధరలు నవంబర్ 10నుంచి అమల్లోకి రానుండగా పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ-పశ్చిమ రైల్వే సన్నాహాలు చేస్తోంది.టికెట్ రేటు పెరిగిన స్టేషన్లు…కృష్ణరాజపురం, బంగారుపేట, తుంకూర్, హోసూర్, ధర్మపురి, కెంగేరి, మండ్య, హిందూపుర్, పెనుగొండ, యెలహంక, బనస్వాడి, కార్మెలారమ్, వైట్‌ఫీల్డ్.
* కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అమెజాన్ సంస్థ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ డెడ్‌లైన్‌ను పెంచింది. వచ్చే ఏడాది జూన్ వరకు ఇంటి నుంచి పని చేయవచ్చు అని పేర్కొన్నది. ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యం ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఈ ఆఫర్‌ను జనవరి వరకు ఇచ్చిన అమెజాన్ సంస్థ.. ఇప్పుడు ఆ సమయాన్ని జూన్ 30 వరకు పెంచింది. అయితే అమెరికాలో సుమారు 19 వేల మంది అమెజాన్ వర్కర్లకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఆ సంస్థ నిర్ణయం తీసుకున్నది. మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ లాంటి టెకీ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ కూడా వచ్చే జూలై వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పెంచింది. గూగూల్ కూడా ఆఫీసులో అవసరం లేని వారికి ఇంటి నుంచి పని చేసే సౌలభ్యాన్ని జూన్ వరకు పొడిగించింది.
* దేశీయ మార్కెట్‌లో దీపావళి సందడి అంతా ఇంతా కాదు. ఈ పండుగ అమ్మకాలపై వ్యాపార వర్గాల్లో ఏటా ఎన్నో అంచనాలుంటాయి మరి. ఇప్పటికే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థలన్నీ ప్రత్యేక ఆఫర్లను సైతం సిద్ధం చేసేశాయి. అయితే ఈసారి దీపావళి పండుగ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చని ఓ సర్వేలో తేలింది. మార్కెట్ రిసెర్చ్ సంస్థ యూగౌవ్ చేపట్టిన ఈ సర్వేలో చాలామంది తమ ఆర్థిక విషయాల్లో గతంలో కంటే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నట్లు స్పష్టమైంది. దాదాపు 50 శాతం మంది ఖర్చులపట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 21 నుంచి 25 మధ్య జరిగిన ఈ సర్వేలో 2,500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 54 శాతం మంది గతేడాది దీపావళి కంటే ఈ ఏడాది తక్కువగా కొనుగోళ్లు జరిపే వీలుందన్నారు. 20 శాతం మంది నిరుడులాగే ఖర్చు చేస్తామన్నారు. ఇక 17 శాతం మంది ఈసారి మరింతగా కొంటామని తెలిపారు. ‘కరోనాతో తలెత్తిన ఆర్థిక మందగమనం తర్వాత ఈ పండుగ అమ్మకాలతో తిరిగి పుంజుకోవాలని వ్యాపారులు చూస్తున్నారు. కానీ వినియోగదారుల్లో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఉత్సాహం లేదు’ అని యూగౌవ్ ఇండియా జీఎం దీపా భాటియా అన్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్, ఆర్థిక మందగమనం నేపథ్యంలో పడిపోయిన ఆదాయం.. షాపింగ్ అవకాశాలను ప్రభావితం చేస్తున్నదన్నారు. కాగా, స్మార్ట్‌ఫోన్ తదితర గ్యాడ్జెట్స్ కొనుగోలుకు 22 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారని, బట్టల షాపింగ్‌కూ సుమారు 22 శాతం మంది ఇష్టం చూపిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. ఇక ఆన్‌లైన్ కొనుగోళ్లకు 54 శాతం మంది ఓటేశారు.
* కొత్త బి-ఎస్‌యూవీ మాగ్నైట్‌ను నిస్సాన్ లాంచ్ చేసింది. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు ప్రత్యక్ష పోటీని ఇస్తూ, నిస్సాన్ మోటార్ కార్ప్ బుధవారం నిస్సాన్ మాగ్నైట్ అనే బి-ఎస్‌యూవీ (దిగువ కాంపాక్ట్ ఎస్‌యూవీ) విభాగంలో కొత్త కారును ఆవిష్కరించింది. వాహన తయారీదారుల ‘ఆల్-న్యూ నెక్స్ట్ స్ట్రాటజీ’లో భాగమైన ఈ కారు, భవిష్యత్తులో నిస్సాన్ భారతదేశంలో విడుదల చేయబోయే ఎనిమిది కొత్త మోడళ్లలో మొదటిది. జపాన్ కార్ల తయారీ సంస్థ అయిన నిస్సాన్ కొన్ని నెలలపాటు టీజర్ చిత్రాలు, భారీ అంఛనాలతో అదరగొడుతూ చివరకు కొత్త వెర్షన్ కారు ‘బి-ఎస్‌యూవీ మాగ్నైట్’ను ఆవిష్కరించింది. భారతీయ మార్కెట్ కోసం నిస్సాన్ నెక్స్ట్ స్ట్రాటజీ క్రింద కంపెనీ ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి ఉత్పత్తి ఇది. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో కొత్త బి-ఎస్‌యూవీ మాగ్నైట్ అందుబాటులోకి రానున్నది.
* ఇంటెలిజెంట్ వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం అయిన జూపర్.. ఐకియా ఇండియాలో తన కోవిడ్ -19 కంప్లియన్స్ ప్యాక్ (Zఉపెర్ఛ్ఛ్ఫచ్క్)ను అమల్లోకి తేనున్నది. ఐకియా ఇండియాలో సాధారణ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నప్పడు కస్టమర్లు, ఉద్యోగులు, ఇతరుల రక్షణ కోసం భద్రతా ప్రమాణాలు నిర్వహించడంలో జూపర్ ప్యాక్ సాయపడనున్నది. హైదరాబాద్, ముంబై, పుణెల్లో తన కార్యకలాపాలను ప్రారంభించిన ఐకియా ఇండియా సంస్థలో కరోనా నివారణ చర్యలు చేపట్టడానికి జూపర్ సీసీ ప్యాక్ చక్కని పరిష్కారం కానుంది.
*మారటోరియం కాలంలో నెలవారీ వాయిదాల (ఈఎంఐ) వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ) చెల్లింపునకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ చెల్లింపు గురించి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వెల్లడించనున్నది. అయితే ఈఎంఐలపై బ్యాంకులు విధించే సాధారణ వడ్డీ, మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మధ్య వ్యత్యాసాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో లౌక్‌డౌన్ కారణంగా అన్ని రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరు నెలలపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు అమలులో ఉన్న ఈ మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నవారు వడ్డీపై వడ్డీ (చక్ర వడ్డీ) చెల్లించాలని అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కొందరు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వడ్డీపై వడ్డీ వసూలు చేయడం అన్యాయమని, దీనిని మాఫీ చేయాలని కోరారు. చివరకు కేంద్రం దీనికి అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న ఈఎంఐలపై అదనపు వడ్డీ భారాన్ని తామే భరిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే దీని అమలుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఒక నెల గడువు కోరింది.