అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జీ జిన్‌పింగ్ మధ్య స్నేహసంబంధాలు బాగానే ఉండేవి . అయితే రాన్రాను అవి క్షీణించిపోవడంతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం పెరిగింది. అమెరికాతో చైనా సంబంధాలు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ చైనాను డొనాల్డ్ ట్రంప్ ఇబ్బంది పెడుతున్నాడు. చైనా అధినేతకు కోపం తెప్పించే పనులు చేస్తున్నాడు. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్ష్య పీఠాన్ని అధిరోహించాలని చైనా ఊవ్విళ్లూరుతున్నది. స్నేహసంబంధాలు అంతగా లేని సమయంలో ఆయన విజయం సాధించాలని చైనా కోరుకోవడంలో ఆంతర్యమేంటి? ఏం ఆశించిన చైనా.. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా రావాలని కోరుకుంటున్నది? ట్రంప్ గెలిస్తే చైనాకు ఏం లాభం?. ఇవి సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. గత కొంతకాలంగా వరల్డ్ సూపర్ దేశాలుగా ఉన్న అమెరికా, రష్యాలు ప్రస్తుతం నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ.. అమెరికాలో మాత్రం పాత తరం నాయకత్వం కరువైనందున దేశం సూపర్ పవర్ స్థాయి రాన్రాను పడిపోతున్నది. ఈ దశలో చైనా తన ఆర్థికాభివృద్ధిని పెంచుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని మెల్లమెల్లగా అమెరికాకు ధీటుగా తయారైంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో వీరికి పోటీగా ఎవరూ లేనంత స్థాయికి ఎదిగారు. తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులో ఉంచేలా చేసి తన విదేశీ మారకద్రవ్యాన్ని పెంచుకున్నది. అదేవిధంగా పలు ఉత్పత్తులకు ముడిసరుకులు లభించే కేంద్రంగా చైనా పురోగతి సాధించింది. తర్వాతి రోజుల్లో ప్రతి చిన్న విషయానికి చైనాపై ఆధారపడేంత స్థాయికి ఇతర దేశాలను తీసుకురావడంలో విజయం సాధించింది.
చైనాను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు అమెరికా శతవిధాలుగా ప్రయత్నం చేసింది. ఇంకా చేస్తూనే ఉన్నది. బిలియన్ డాలర్లు ఖర్చు చేసి చైనా టెక్ సంస్థలను అమెరికా వేధించింది. బీజింగ్ నుంచి కరోనా వైరస్ బయటి ప్రపంచంలోకి వచ్చిందని ఆరోపిస్తూ చైనాపై ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేపారు. చైనాకు వంతపాడుతున్నారంటూ ఆరోపించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కు నిధులు నిలిపివేయడమే కాకుండా వీరితో కలిసి పనిచేయమంటూ బయటకొచ్చారు. చైనాను ఆర్థికంగా దెబ్బతీసే చర్యలు తీసుకున్నారు. విస్తృతమైన ఆసియ-పసిఫిక్ వాణిజ్య ఒప్పందం, వాతావరణ ఒప్పందాల నుంచి అమెరికాను ట్రంప్ బయటకు తీసుకొచ్చారు. చైనా వస్తువులపై పెద్ద మొత్తంలో సుంకాలు విధించారు. కాగా, అమెరికా ఎక్కడైతే తగ్గి కనిపించిందో.. అక్కడ చైనా ముందుకు అడుగేసింది.
ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి విజయం సాధించాలని చైనా అధినేత జీ జిన్‌పింగ్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. చైనా సూపర్ పవర్ దేశంగా ఎదగడానికి ట్రంప్ లాంటి వ్యక్తులు అధికారంలో ఉండాల్సిందే అని చైనా నమ్ముతున్నది. ట్రంప్ రెండోసారి గెలిస్తే.. ప్రపంచ వేదికపై గొప్ప శక్తిగా ఎదిగేందుకు చైనాకు ఎక్కువ సమయం అవసరం లేదని బక్నెల్ విశ్వవిద్యాలయం రాజనీతిశాస్త్రం, అంతర్జాతీయ సంబంధాల విభాగం ప్రొఫెసర్ జికున్ ఝు చెప్తున్నారు. ప్రపంచీకరణ, బహుపాక్షికత, అంతర్జాతీయ సహకారానికి విజేతగా నిలిచే ప్రపంచ స్థితిని పెంచే అవకాశాన్ని అమెరికా అప్పగిస్తుందని బక్నెల్ అభిప్రాయపడుతున్నారు. అలాగే, ట్రంప్ పదే పదే చెప్పే ‘అమెరికా ఫస్ట్’ విధానాల పొడిగింపు బీజింగ్‌కు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుందని అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో చైనా నిపుణుడు ఫిలిప్ లే కొర్రే అంగీకరించారు. వాషింగ్టన్‌ను దాని సాంప్రదాయ మిత్రదేశాల నుంచి పాక్షికంగా నరికివేస్తుందని, ఇది చైనాకు యుక్తినిస్తుందని ఆయన చెప్పారు. చైనీయులు ఇప్పటికే ట్రంప్‌కు బహిరంగంగా చీర్స్ చెప్తున్నారంటే వారి ఉద్దేశమేంటో మనం అర్ధం చేసుకోవచ్చు.
డొనాల్డ్ ట్రంప్ నిస్సందేహంగా చైనాకు ఆర్థిక, రాజకీయ ఇబ్బందులను కలిగించారు. వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం కోసం చైనా చేసిన ప్రణాళికలో చైనా చాలా నష్టపోయింది అని బీజింగ్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు హువా పో అన్నారు. జనవరిలో అమెరికా, చైనా తమ వాణిజ్య యుద్ధంలో పాక్షిక సంధిని తీసుకువచ్చే ఒప్పందంపై సంతకం చేశాయి. దీనివల్ల బీజింగ్ కార్లు మొదలుకుని యంత్రాల వరకు.. చమురు నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వరకు రెండేండ్లలో అదనంగా 200 బిలియన్ డాలర్ల అమెరికన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. ఇదే సమయంలో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ విజయం సాధిస్తే చైనాకు పెద్దగా ఉపశమనం లభించకపోవచ్చు. దాంతో చైనా ప్రజలు ట్రంప్ గెలిచేందుకు బహిరంగ మద్ధతు ఇస్తుండటాన్ని బిడెన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ చాణక్యం తన ఓటమికి దారితీస్తుందని బిడెన్ భయపడిపోతున్నాడు.
మానవ హక్కులపై బిడెన్ అమెరికన్ నాయకత్వాన్ని పునరుద్ధరించే అవకాశం ఉన్నదని బీజింగ్ ఆందోళన చెందుతున్నది. ఉయ్ఘర్లు, టిబెట్, హాంకాంగ్‌లోని స్వేచ్ఛ విషయమై చైనాపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. జిన్జియాంగ్, టిబెట్‌లోని మానవ హక్కుల సమస్యలపై ట్రంప్ కంటే బిడెన్ కఠినంగా ఉండే అవకాశం ఉన్నదని బక్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన జికున్ ఝు అన్నారు.