NRI-NRT

సింగపూర్‌లో మైనర్ బాలికపై భారతీయుడి అఘాయిత్యం

సింగపూర్‌లో మైనర్ బాలికపై భారతీయుడి అఘాయిత్యం

విదేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యాచారం, లైంగికంగా వేధించడం వంటి నేరాలకు ఉరిశిక్ష, యావజ్జీవ శిక్షలు వేసిన సంఘటనలూ తరచూ వింటూ ఉంటాం. ఇలానే ఓ మైనర్‌ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు ఓ భారతీయుడికి ఏడు నెలల జైలు శిక్ష పడిన సంఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. ఓ మీడియా కథనం ప్రకారం.. చెల్లం రాజేశ్‌ కన్నన్‌ (26)కు సామాజిక మాధ్యమాల ద్వారా గతేడాది ఓ బాలిక (15) పరిచయమైంది. రాజేశ్‌కు అప్పటికే పెళ్లయి ఓ కుమార్తె ఉంది. కొన్ని రోజులు ఒకరికొకరు సంక్షిప్త సందేశాలు పంపుకునేవారు. గత ఏడాది ఆగస్టులో మొదటిసారి బాలికను కన్నన్‌ కలిశాడు. ఆ తర్వాత మరోసారి కలవడానికి బాలిక అంగీకరించింది. అయితే దానికి మూడు రోజుల ముందు తన స్నేహితుల కోసం మద్యం సీసాలు తీసుకురావాలని రాజేశ్‌ను మైనర్‌ కోరింది. ఆమెకు మద్యం సీసాలు ఇచ్చే నెపంతో ముద్దు పెట్టుకోవాలని కోరగా.. ఆమె తిరస్కరించింది. అయినా బలవంతంగా ముద్దు పెట్టుకోవడమే కాకుండా మద్యం తీసుకొచ్చానని తనతో లైంగిక చర్యకు సహకరించాలని బలవంతం చేసినట్లు ఆమె కేసు పెట్టింది. విచారణ సందర్భంగా తాను చేసిన పనికి సిగ్గుగా ఉందని, పశ్చాత్తాప పడుతున్నానని నిందితుడు రాజేశ్‌ వాపోయాడు. సింగపూర్‌లో గత మూడు సంవత్సరాల్లో మరెలాంటి నేరాలకు పాల్పడలేదని చెప్పుకొచ్చాడు. నిందితుడు రాజేశ్‌ కన్నన్‌ గతంలో భద్రతా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించాడు. ‘ఈ కేసులో ఎన్నో బాధలు ఎదుర్కొన్నా. నా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా. నా కుటుంబాన్ని కోల్పోయా’ అని కోర్టు ముందు వాపోయాడు. బాధితురాలిని బలవంతం చేసినందుకు గానూ అతడికి న్యాయమూర్తి 7 నెలల జైలు శిక్ష విధించారు.