తెరాస సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అర్ధరాత్రి 12.25 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందారు. అనంతరం కొవిడ్ నెగటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. ఈ క్రమంలో ఆయన మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కార్మిక నేత నర్సన్నగా సుపరిచితుడైన నర్సింహారెడ్డి 1944 మే 12న సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి దంపతులకు జన్మించారు. నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ము. తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ కీలక పాత్ర పోషించిన నాయిని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికయ్యారు. 1970లలో హైదరాబాద్‌కకు మకాం మార్చిన నాయిని నర్సింహారెడ్డి వీఎస్‌టీ కార్మిక సంఘం నేతగా పలుమార్లు ఎన్నికయ్యారు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయిని ముషీరాబాద్ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచారు. మొదటిసారిగా 1978లో టి.అంజయ్యపై గెలిచారు. 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001లో తెరాసలో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా చేసిన నాయిని.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ అనంతరం తొలి హోంమంత్రిగా పనిచేశారు. తెలంగాణ హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు. నాయిని మృతిపట్ల మంత్రి ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. ఉద్యమ సమయంలో నాయినితో ఉన్న అనుబంధం మరువలేనిదన్నారు. నాయిని మరణం తెరాసకు, తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఈటల తెలిపారు. నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాయుని నర్సింహారెడ్డి ఇకలేరు
Related tags :