* నిస్సాన్ మోటార్ ఇండియా త్వరలో విడుదల చేయనున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘మాగ్నైట్’ను బుధవారం ప్రదర్శించింది. 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా వచ్చే నెలలో అధికారికంగా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కియా సొనెట్, మారుతీ విటారా బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడళ్లతో మాగ్నైట్ పోటీపడే అవకాశం ఉంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీకి మారే ఆలోచన ఉన్నవారికి ఇది సరైన మోడల్ అని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవా పేర్కొన్నారు. 60- 40 స్ల్పిట్ ఫోల్డింగ్ రేర్ సీట్లు, 336 లీటర్ లగేజ్ స్పేస్, అరౌండ్ వ్యూ మిర్రర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వ్యవస్థ, 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ తెర వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సదుపాయాల్లో లభించనుంది. ఈ కారు లీటర్‌కు 20 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
* ప్రపంచంలోనే దిగ్గజ ఫార్మా కంపెనీల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ ఎక్ఛేంజీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ సంస్థకు చెందిన ఐటీ విభాగాలపై సైబర్ దాడిని గుర్తించినట్లు డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యల్లో భాగంగా అన్ని డేటా సెంటర్లలను ప్రత్యేకంగా ఉంచి, పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ సైబర్ దాడి ఎవరు, ఎక్కడి నుంచి చేశారనే వివరాలను మాత్రం డాక్టర్ రెడ్డీస్ వెల్లడించలేదు. సంస్థ కార్యకలాపాలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సంస్థ సీఐఓ ముఖేష్ రాథీ ప్రకటించారు. వచ్చే 24గంటల్లో కార్యకలాపాలు యథాస్థితికి వస్తాయనే ఆశాభావం వ్యక్తంచేశారు.
* వరుసగా నాలుగు రోజుల పాటు లాభాల్లో కొనసాగిన సూచీలు గురువారం నష్టాలను చూవి చూశాయి. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు ఉండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 149 పాయింట్లు నష్టపోయి, 40,558 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11,896 వద్ద స్థిరపడింది.
* దక్షిణకొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ భారత్‌లో సరికొత్త మోడల్ ఐ20ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా మొదలైంది. దిల్లీ, ముంబయి, చెన్నై ఎంపిక చేసిన డీలర్ల వద్ద బుకింగ్స్ మొదలు పెట్టింది. ఈ నెల చివర్లో కంపెనీ నుంచి నేరుగా బుక్ చేసుకొనే సౌకర్యాన్ని కూడా మొదలుపెట్టవచ్చు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.28 సమయంలో సెన్సెక్స్ 96 పాయింట్ల నష్టంతో 40,610 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 11,904 వద్ద ట్రేడవుతున్నాయి. సుజ్లాన్ ఎనర్జీ, చెన్నై పెట్రో, జేకే టయర్స్ అండ్ ఇండస్ట్రీస్, దేవాన్ హౌసింగ్ షేర్లు లాభాల్లో ఉండగా.. కేపీఐటీ టెక్నాలజీస్, జస్ట్‌డయల్, డెల్టా కార్ప్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రాత్రి వాల్‌స్ట్రీట్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. నేడు 48 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్‌ఆటో, భారతీ ఇన్ఫ్రాటెల్, ఎస్‌బీఐ కార్డ్స్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
* ఖాదీ వస్త్రంతో తయారు చేసిన పాదరక్షల (ఫ్యాబ్రిక్ ఫుట్‌వేర్)ను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) బుధవారం విపణిలోకి విడుదల చేసింది. రూ.50,000 కోట్ల విలువైన భారతీయ పాదరక్షల మార్కెట్‌లో 2 శాతం మార్కెట్ వాటా దక్కించుకునే లక్ష్యంతో ఉన్నామని కేవీఐసీ వెల్లడించింది. దృశ్య మాధ్యమం (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా కేంద్ర ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శాఖ (సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు) మంత్రి నితిన్ గడ్కరీ ఈ పాదరక్షల్ని విడుదల చేశారు. ఒక జత షూలు, చెప్పుల ధరలు రూ.1,100-3,300 మధ్య ఉంటాయని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతానికి మహిళల పాదరక్షల్లో 15 డిజైన్లు ఉండగా, పురుషుల పాదరక్షల్లో 10 డిజైన్లు ఉన్నట్లు ఆయన వివరించారు. కేవీఐసీ ఇ-పోర్టల్ ద్వారా ఖాదీ పాదరక్షల ఆన్‌లైన్ సేల్స్‌ను కూడా మంత్రి బుధవారం ప్రారంభించారు. ‘అంతర్జాతీయ నాణ్యతతో పటోలా సిల్క్, బనారసి సిల్క్, కాటన్, డెనిమ్ వంటి ఫైన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందుతున్న ఈ పాదరక్షలు యువతరానికి బాగా నచ్చుతాయ’ని నితిన్ గడ్కరీ వివరించారు.
* హీరో ఎలక్ట్రిక్ నైక్స్ బీ2బీ స్కూటర్లలో అధునాతన వెర్షన్‌లను విపణిలోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.63,990గా నిర్ణయించారు. బీ2బీ వినియోగదారులు ఈ స్కూటర్లను డెలివరీలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కొత్త వెర్షన్‌లను మరింత శక్తిమంతంగా తీసుకొచ్చామని, ఒకసారి ఛార్జింగ్‌తో కనీసం 82 కి.మీ ప్రయాణం, గరిష్ఠంగా 210 కి.మీ ప్రయాణం చేయొచ్చని కంపెనీ తెలిపింది. కొత్త నైక్స్-హెచ్‌ఎక్స్ సిరీస్‌ను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మలిచామని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ పేర్కొన్నారు. తక్కువ నిర్వహణ వ్యయం, అధిక బరువు మోసే సామర్థ్యం, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయని తెలిపారు.