ఇప్పుడంటే తెలంగాణలో ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి కనుక నీరు దాదాపుగా అన్ని ప్రాంతాలకు అందుతోంది. కానీ ఒకప్పుడు ప్రాజెక్టులు ఎక్కువగా ఉండేవి కావు. దీంతో జనాలు నీళ్ల కోసం బావులు, చెరువులు, కుంటల మీదనే ఎక్కువగా ఆధారపడేవారు. వర్షాకాలంలో వర్షాలు బాగా పడితే ఒకటి రెండేళ్ల వరకు బావులు, చెరువులు, కుంట్లలో నీరు సమృద్ధిగా లభించేది. అయితే తెలంగాణలో అనేక ప్రాంతాలకు వీటి మీదుగానే పేర్లు పెట్టారు.తెలంగాణలో ఒకప్పుడు ప్రజలకు నీళ్లు ఎక్కువగా బావులు, చెరువులు, కుంటల ద్వారానే అందేవి. దీంతో చెరువులు, కుంటల పేరిట చెంజెర్ల, ముచ్చెర్ల, పటాన్‌చెరువు, అనంతసాగరం, గుండ్ల సాగరం, జమ్మికుంట, నల్లకుంట, రేచెర్ల, గంగచెర్ల, మాచెర్ల.. తదితర పేర్లను ఊళ్లకు పెట్టారు. వాటితోనే ఊళ్లను పిలిచారు. అవే పేర్లు ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. ఇక ప్రజలకు ప్రధానంగా నీళ్లు అందించే బావుల పేరిట కూడా ఊళ్ల పేర్లు పెట్టారు. అందుకనే కొన్ని ప్రాంతాలకు గుండ్ల బావి, రెడ్ల బావి, చిన్న బావి, బావిపేట, గిర్ని బావి అనే పేర్లు వచ్చాయి. వాటితోనే ఆయా గ్రామాలను పిలవడం మొదలు పెట్టారు. అయితే అప్పట్లో తెలంగాణలో ఉర్దూ భాషను ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో కొందరు బావులను హిందుస్థానీలో బౌలి అని పిలిచేవారు. అందువల్లే ఆయా ప్రాంతాలకు బౌలి అనే పేరు వచ్చింది. బౌలి అంటే హిందుస్థానీలో బావి అని అర్థం వస్తుంది. కనుకనే గచ్చిబౌలి, చార్‌బౌలి, దూధ్ బౌలి అనే పేర్లు ఆ ప్రాంతాలకు వచ్చాయి. గచ్చిబౌలిలో ఎన్నో ఏళ్ల కాలం నాటి గచ్చి బావి ఉంది. ఇప్పుడు దాన్ని ఉపయోగించడం లేదు. కానీ ఒకప్పుడు ఆ ప్రాంత ప్రజలకు ఆ బావి నీరు ఎంతగానో ఉపయోగపడింది. ఈ క్రమంలోనే కాలక్రమేణా గచ్చిబావి కాస్తా గచ్చిబౌలి అయింది. అప్పటి నుంచి దాన్ని అలాగే పిలవడం మొదలు పెట్టారు. ఇక మిగిలిన ప్రాంతాల్లోనూ ఉన్న బావుల వల్లే ఆయా ప్రాంతాల చివర్లలో బావికి బదులుగా బౌలి అని చేరింది. ఇదీ.. బౌలి అని ఆయా ప్రాంతాల పేర్ల వెనుక ఉండడానికి గల అసలు కారణం..!
గచ్చిబౌలికి ఆ పేరు అలా వచ్చింది
Related tags :