‘అది సృష్టి దోషమో లేక నా దృష్టి దోషమోగాని, ప్రతి మొహంలోను నాకు దైన్యమే గోచరిస్తుంది’ అన్నాడు విలియం బ్లేక్ అనే మహాకవి. ‘నీవు ఆనంద స్వరూపుడివి’ అంటుంది వేదాంతం. ‘కానే కాదు’ అంటుంది నిజ జీవితం. లోకం రెండోదాన్నే గట్టిగా సమర్థిస్తుంది. ‘మీ కళ్ళు చాలా బాగుంటాయి’ అన్నారొకరు- ప్రపంచ సుందరి సోఫియా లారెన్‌తో. ‘వాటికి కన్నీళ్ళతో పరిచయం ఎక్కువ కనుక…’ అందామె!
ఆనందం అంటే ఏమిటి, అదెలా లభిస్తుంది అని ప్రపంచ తత్వవేత్తలంతా తర్జనభర్జనలు పడుతూనే వచ్చారు. తోచిన పరిష్కారాలను లోకంతో పంచుకొంటునే ఉన్నారు. ‘దుఃఖానికి కారణమయ్యేవాటిని పట్టుకొని వేలాడుతుండటమే ఆనందం దూరం కావడానికి కారణం’ అని సూత్రీకరించాడు బెర్ట్రండ్ రస్సెల్ అనే తత్వవేత్త. వాటిని వదుల్చుకోగలిగితే, కనీసం వదులుగా ఉంచుకోగలిగితే మనిషికి ఆనందం లభిస్తుంది అన్నాడాయన. దుఃఖానికి కారణాలు కనుగొంటే, ఆనందానికి ఆచూకీ దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు. తన గురించి తనకున్న అంచనాలు, ఆలోచనలే మనిషి దుఃఖానికి ప్రధాన కారణాలన్నది ఆయన ప్రతిపాదన.
అవి ముఖ్యంగా మూడు రకాలు. అందరిమీదా పెత్తనం చలాయించాలన్న బలమైన కోరిక మొదటిది. ‘నన్ను అందరూ గుర్తించాలి’ అనేది రెండోది. ‘నేను చేసేవన్నీ పాపాలే… నాకన్నా మహా పాపి ఎవడూ లేడు’ అనే ఆత్మన్యూనతా భావం మూడోది. ముఖ్యంగా ఈ మూడు మనిషిని ఆనందానికి దూరంగా ఉంచుతాయన్నది రస్సెల్ అభిప్రాయం.
ఎదుటివాడు తనకు భయపడుతూ బతకాలనుకోవడం మనిషి మూర్ఖత్వానికి గుర్తు. ప్రతివాడి మీదా పెత్తనం చలాయించాలనుకోవడం పిచ్చితనం. భార్యలపై భర్తలు, పిల్లలపై పెద్దవాళ్లు, బలహీనులపై బలవంతులు దాష్టీకం చేసేది ఆ అవివేకంతోనే! ఆ కసికి క్షణాల్లో కాస్త సంతృప్తి దక్కుతుందేమోగాని- ఎక్కడ అణచివేత ఉంటుందో, అక్కడ తిరుగుబాటు తప్పదన్నది చారిత్రక సత్యం. ఒక్కసారి అవతలివాడు తిరగబడ్డాడా మనకిక జీవిత కాలంపాటు దుఃఖమే తప్ప మనశ్శాంతి ఉండదు.
చలన చిత్ర నటీనటులకు, క్రీడారంగంలోని విజేతలకు, సమాజంలో మంచి స్థాయిలో ఉండేవారికి లభించే సత్కారాలు, గౌరవాలు చూస్తున్నప్పుడల్లా తమకూ అలాంటి గుర్తింపు లభిస్తే ఎంత బాగుంటుంది అని ఎందరో అనుకొంటారు. కాని మనలో చాలామందికి వారి కీర్తిప్రతిష్ఠల గురించి ఆలోచనలే తప్ప- ఆ స్థితికి చేరుకొనే క్రమంలో వారుపడ్డ కష్టాలు, వారికి ఎదురైన ఘోర పరాజయాలు, పరాభవాల గురించి ఆలోచించే జ్ఞానం ఉండదు. ఉన్నా వాటిని ఎదుర్కొనే సంసిద్ధత ఉండదు. గుర్తింపు దాహం మాత్రం పదేపదే వేధిస్తూ ఉంటుంది. తాను గొప్పవాణ్ననే భావం, తన గొప్పదనాన్ని లోకం గుర్తించడం లేదనే దుగ్ధ మనిషిని అశాంతికి గురిచేస్తూ ఉంటాయి. రచయితల్లో, మేధావుల్లో నాయకుల్లో ఇలా గుర్తింపు కోసం వెంపర్లాట బాగా కనిపిస్తుంది.
‘ఎంత పేరొచ్చిందో’ నుంచి ‘ఎలా వచ్చిందో’ అన్న దిశగా మన ఆలోచనలను మళ్లిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఆనందం దక్కే అవకాశమూ లేదు. మనలో చాలామందికి దేవతార్చనచేస్తున్నప్పుడు,ధ్యానా నికి కూర్చున్నప్పుడు శృంగారపరమైన ఆలోచనలు తోచి, మనసు తీవ్రమైన ఆందోళనకు గురవుతుంది. జీవితంలో అనేక సందర్భాల్లో చిన్నప్పుడు చదివిన నీతి పాఠాలు గుర్తొచ్చి మనోవ్యధకు కారణం అవుతాయి. మాంసాహారం రుచులను ఆనందంగా ఆస్వాదిస్తుండగా, ఆ వేళ ఏ వారమో స్ఫురించి కొందరికి మనసు కకావికలం అయిపోతుంది. మన నుంచి ఆనందం దూరంగా పారిపోతుంది. మరి కొంతమందికైతే ఒట్టేస్తే పాపం, ఓ రోజు పూజ మానేస్తే పాపం, కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిందైతే పాపం, ధ్యానం తెగిపోతే పాపం… చేసేవన్నీ పాపాలే!
ఈ రకమైన దోష భావనలు కిక్కిరిసిపోతే గుండెల్లో ఆనందానికి రవ్వంత చోటే దొరకదు. ఇలాంటివన్నీ బాల్యంలో పేరుకొనే మూఢ నమ్మకాలు. భక్తి మంచిదే, మూఢభక్తి ప్రమాదకరమైనది. ఆలోచనల్లో వచ్చే మార్పే- ఆనందానికి రహదారన్నది పెద్దల తీర్పు. మన గురించి మన అంచనాలు సరైనవైతే- ఆనందం మన సొత్తే!