Fashion

తెలంగాణ పట్టణ మహిళల్లో ఊబకాయం

తెలంగాణ పట్టణ మహిళల్లో ఊబకాయం

తెలంగాణ రాష్ట్రంలో పట్టణ మహిళలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆరోగ్య గణాంకాల విభాగం రూపొందించిన 2019–20 నివేదికలో పేర్కొంది. 15–49 ఏళ్ల వయసున్న మొత్తం మహిళల్లో 28.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా, పట్టణాల్లోనే 39.5 శాతం మంది అధిక బరువుతో ఉన్నారని తెలిపింది. అందులో తక్కువ బరువు ఉన్న మహిళలు 23.1 శాతం ఉన్నారు. కాగా, రాష్ట్రంలో మహిళలను రక్తహీనత వేధిస్తోంది. 15–49 ఏళ్ల వయసున్న మహిళల్లో 56.7 శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. వీరిలో గర్భిణీలు 48.2 శాతం మంది ఉండటం గమనార్హం. అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలను ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. అధిక బీపీ ఉన్న మహిళలు 19.8 శాతం, పురుషులు 18.2 శాతం ఉన్నారు. డయాబెటిస్‌తో ఉన్న మహిళలు 6.9 శాతం, పురుషులు 6 శాతం ఉన్నారని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పౌష్టికాహార లోపం కారణంగా బాధపడుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేని వారు 28.1 శాతం కాగా, బక్కచిక్కిన పిల్లలు 18 శాతం, బరువు తక్కువగా ఉన్న వారు 28.5 శాతంగా నమోదయ్యారు.
**వైద్యం పొందడంలో మూడో స్థానం..
ఆరోగ్య పథకాలు, వివిధ బీమా పథకాల ద్వారా వైద్యం పొందే కుటుంబాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 66.4 శాతం కుటుంబాలకు ఈ సౌకర్యం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంలో చికిత్స పొందుతున్నవారు 40.5 శాతం మంది ఉండగా, మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది.
****ఇవీ ఇతర వివరాలు..
*ఆరోగ్య కార్యకర్తల ద్వారా జరిగే జననాలు రాష్ట్రంలో 91.4 శాతం ఉన్నాయి.
*రాష్ట్రంలోని చిన్న పిల్లల్లో పూర్తిస్థాయిలో టీకాలు పొందేవారు 68.1 శాతం. జాతీయ సగటు 62 శాతం.
*15–49 ఏళ్ల వయసు వారిలో వారానికోసారి మద్యం సేవించే మహిళలు 28.5 శాతం ఉంటే, పురుషులు 45.5 శాతం ఉన్నారు.
*15–49 ఏళ్ల వయసు వారిలో పొగాకు తాగేవారు 70.6% పురుషులు, 48.8% మంది మహిళలు ఉన్నారు.
*6 నెలలలోపు తల్లిపాలు తాగే పిల్లలు 67.3 శాతం.
*2011లో దేశ జనాభా 121 కోట్లు ఉం టే, 2016 నాటికి 129 కోట్లకు చేరు కుంది. 2021 నాటికి 136 కోట్లు, 2026 నాటికి 142.30 కోట్లు, 2031 నాటికి 147.50 కోట్లు, 2036 నాటికి 151.83 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది.