* కరోనా వైరస్ ప్రభావంతో అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రజా రవాణా పట్ల ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది. కుటుంబ సభ్యుల భద్రత నేపథ్యంలో సొంత వాహనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగిపోయాయి. కొనుగోళ్లతోపాటు ధరలు సైతం అమాంతం పెరిగాయి. ఒకప్పుడు ధనవంతులు మాత్రమే కార్లను ఎక్కువగా వినియోగించేవారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం మధ్యతరగతి వారు కార్లపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త కార్లను కొనుగోలు చేసే స్తోమత లేనివారు వినియోగించిన వాహనాలపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రూ.70వేల నుంచి రూ.3లక్షల వరకు లభించే వాహనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో గతంలో రూ.70వేలకు లభించిన కార్లు కాస్త రూ.లక్షన్నరకు చేరుకున్నాయని కొనుగోలు దారులు అంటున్నారు. ‘‘కరోనా కారణంగా బస్సులు, ఆటోల్లో వెళ్లాలంటే భయంగా ఉంటోంది. అందుకని సొంతంగా వాహనం కొనుగోలు చేయాలని అనుకున్నాం. అయితే, కొత్త కారు కొనాలంటే భారీ ఎత్తున ఖర్చవుతోంది. ఆ పరిస్థితి లేదు కాబట్టి సెకెండ్ హ్యాండ్ కారు దొరుకుతుందేమో అని వచ్చాం. ఇక్కడ చాలా వరకు వినియోగించిన కార్లు దొరుకుతున్నాయి’’ అని కొనుగోలు దారులు చెబుతున్నారు.
* వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు 2019పై చర్చించేందుకు ఏర్పాటైన పార్లమెంట్ సంయుక్త కమిటీ (జేపీసీ) ముందు హాజరయ్యేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిరాకరించింది. సంబధిత అంశంపై చర్చించే నిపుణులు విదేశాల్లో ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం చేయడం అంత సురక్షితం కాదని ఆ కంపెనీ కమిటీకి తెలియజేసినట్లు తెలిసింది. భేటీకి గైర్హాజరును తీవ్రంగా పరిగణిస్తామని ప్యానెల్ ఛైర్మన్, భాజపా ఎంపీ మీనాక్షి లేఖి తెలిపారు. అక్టోబర్ 28న కంపెనీ తరఫున ఏ ఒక్కరూ సమావేశానికి హాజరుకాకపోతే ఆ కంపెనీపై కఠిన చర్యలకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.
* దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9:47 గంటల సమయంలో సెన్సెక్స్ 147 పాయింట్లు ఎగబాకి 40,705 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 11,948 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.45 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం సానుకూలంగా ముగిశాయి.
* ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో ఎస్బీఐ కార్డ్ రూ.206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన నికర లాభం రూ.381 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.2,376 కోట్ల నుంచి 6 శాతం పెరిగి రూ.2,513 కోట్లకు చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రమోట్ చేస్తున్న ఎస్బీఐ కార్డ్ సంస్థలో 2020-21 రెండో త్రైమాసికం నాటికి 1.1 కోట్ల క్రెడిట్ కార్డులు మనుగడలో ఉన్నాయి. ఏడాది క్రితం నాటి 95 లక్షల కార్డులతో పోలిస్తే ఇవి 16 శాతం ఎక్కువ. అయితే వీటి ద్వారా ఖాతాదారులు చేసిన వ్యయాలు మాత్రం రూ.33,176 కోట్ల నుంచి 10.8 శాతం తగ్గి, రూ.29,590 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ వడ్డీ ఆదాయం రూ.1,162 కోట్ల నుంచి 9.7 శాతం పెరిగి రూ.1,275 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2.33 శాతం నుంచి 4.29 శాతానికి ఎగబాకాయి. మొత్తం స్థూల రుణాలు రూ.23,038 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.23,978 కోట్లుగా నమోదయ్యాయి. 2020 సెప్టెంబరు 30 నాటికి కంపెనీ మొత్తం బ్యాలెన్స్ షీట్ రూ.24,313 కోట్లు ఉండగా, నికర విలువ రూ.5,949 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కొత్త ఖాతాలు 6,88,000 జతచేరాయి. ఏడాది క్రితం 2,88,000 కొత్త కార్డులు మాత్రమే జతయ్యాయి. రోజువారీ కొత్త కార్డుల జారీ కొవిడ్-19 ముందున్న పరిస్థితులకు దగ్గరగా (98%) ఉందని ఎస్బీఐ కార్డ్ పేర్కొంది. రిటైల్ వ్యయాలు త్రైమాసిక ప్రాతిపదికన 50 శాతం మేర పెరిగాయి. కొవిడ్-19 ముందున్న పరిస్థితులతో పోల్చినా 90 శాతంగా ఉన్నాయని వివరించింది.
* ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.150 లక్షల కోట్లు) మార్కెట్ విలువను అధిగమించిన తొలి కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన ఇంటర్‌బ్రాండ్-2020 ర్యాంకింగ్ల్లోనూ తన సత్తా చాటి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 323 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, 200 బిలియన్ డాలర్లతో అమెజాన్‌కు రెండో స్థానం దక్కింది. 166 బిలియన్ డాలర్ల విలువతో మైక్రోసాఫ్ట్ మూడో స్థానంలో నిలవగా, 165 బిలియన్ డాలర్లతో గూగుల్‌కు 4వ స్థానం దక్కింది. శాంసంగ్, ఫేస్బుక్ వరుసగా 5, 12 స్థానాల్లో నిలిచాయి. ఫేస్బుక్ ఆధీనంలోని ఇన్స్టాగ్రామ్ 19వ స్థానంలో నిలిచింది. యూట్యూబ్-30, టెస్లా-40, జూమ్-100 ర్యాంకుల్లో నిలిచాయి. బ్రాండు విలువ అనేది కంపెనీ విలువకు సంబంధం ఉండదు. యాపిల్ కంపెనీ విలువ 2 లక్షల కోట్ల డాలర్లు కాగా, బ్రాండ్ విలువ 323 బిలియన్ డాలర్లు.
* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లో పయనించాయి. దీనికి తోడు అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లు సైతం సానుకూలంగా కదలాడాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ వంటి ప్రధాన షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది.
* కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపించినా, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు (వీసీలు) తమ పెట్టుబడుల్ని భారత్‌లోకి చొప్పిస్తూనే ఉన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో ఏకంగా 3.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.27,000 కోట్లు) పెట్టుబడులు ఈ రూపేణ తరలివచ్చాయి. ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్, జియో ఒప్పందాలు ఇందుకు దన్నుగా నిలిచాయి. జూన్ త్రైమాసికంలో దేశ వ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ కొనసాగడంతో వీసీల నుంచి 1.5 బిలియన్ డాలర్లు మాత్రమే దేశీయ కంపెనీల్లోకి తరలి వచ్చాయని, వాటితో పోలిస్తే సెప్టెంబరు త్రైమాసికంలో రెట్టింపునకు పైగా పెరిగాయని కేపీఎమ్‌జీ నివేదిక తెలిపింది. డిసెంబరు త్రైమాసికంలోనూ పెట్టుబడుల వెల్లువ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే, పెట్టుబడులు దేశంలోకి అంత ఎక్కువగా ఏమీ రాలేదని, 500 మిలియన్ డాలర్లు మాత్రమే అదనంగా వచ్చాయని వివరించింది. దేశీయంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్ ప్రకటించడం, జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనంగా మరో 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతామని చెప్పడం కూడా వీసీల పెట్టుబడులు ఊపందుకోవడానికి కారణమైంది. జూన్ త్రైమాసికంలో ఫేస్బుక్ కూడా 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టడానికి ముందుకొచ్చింది.