శరీరంలో ఐరన్ లోపించడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంటుంది. అయితే అన్ని జబ్బులకూ మన శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపించినట్లే.. రక్తహీనత ఉన్నవారిలోనూ పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఎవరిలో అయినా సరే రక్తహీనత ఉందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..! * రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో, లేదో వైద్యుడిచే పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.
* రక్తహీనత ఉన్నవారి చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది. లేదా బూడిదరంగులోనూ కొందరి చర్మం దర్శనమిస్తుంది. రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది కనుక చర్మం రంగు మారుతుంది. ఇలా గనక ఉంటే రక్తహీనతే అని అనుమానించాలి.
* శరీరంలో తగినంత రక్తం లేకపోతే అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఛాతి భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఛాతి నొప్పి వస్తుంది కనుక.. వైద్యున్ని సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుక్కోవచ్చు. * రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది. ఈ రకమైన వింత లక్షణాలు ఉంటే దాన్ని రక్తహీనతేమో అని అనుమానించాలి. * శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కారణం అయి ఉండవచ్చు. ఎందుకంటే శరీరంలో తగినంత రక్తం ఉంటే అన్ని భాగాలకు ఉష్ణం సరిగ్గా సరఫరా అవుతుంది. దీంతో శరీరం వేడిగా ఉంటుంది. ఇక రక్తం లేకపోతే శరీరం చల్లగా ఉంటుంది. * తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత అందుకు కారణం అయి ఉండవచ్చు. ఈ క్రమంలో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తే తలనొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కనుక తలనొప్పి వస్తున్న వారు రక్తహీనత ఉందని అనుమానించి, పరీక్షలు చేయించుకుని, ఆ విషయాన్ని నిర్దారించుకుని మందులను వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు.
రక్తహీనత లక్షణాలు ఇవి
Related tags :