హనీమూన్ కు ఖతార్ దేశానికి వెళ్లిన నూతన జంట జైలు పాలైన ఘటన తాజాగా వెలుగుచూసింది.
ముంబై నగరానికి చెందిన ఒనీబా, షరీఖ్ లు గత ఏడాది కొత్తగా పెళ్లి చేసుకున్నారు. నూతన దంపతులకు వారి సమీప బంధువు తబస్సం రియాజ్ ఖురేషీ వివాహ బహుమతిగా హనీమూన్ కోసం ఖతార్ పర్యటనకు ఏర్పాట్లు చేశారు. హనీమూన్ బహుమతిగా ఖతార్ పర్యటన ఏర్పాట్లు చేసిన రియాజ్ కొత్త జంట ఒనిబా, షరీఖ్ ల సామాన్లలో 4 కిలోల హషీష్ ను ప్యాక్ చేశారు. దీంతో కొత్త జంట హనీమూన్ కోసం ఖతార్ విమానాశ్రయంలో దిగగానే వారి సామాన్లు తనిఖీ చేయగా మాదకద్రవ్యాలు ఉండటంతో వారిని ఖతార్ జైలుకు పంపించారు.ఒనిబా జైలులోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 2019 జులై 6వతేదీన జరిగిన ఖతార్ యాత్రలో కొత్త దంపతులు డ్రగ్ తీసుకువెళ్లినందుకు జైలు పాలయ్యారు.
ఈ జంటకు పదేళ్ల జైలు శిక్షతోపాటు కోటి రూపాయల జరిమానా విధించారు. కొత్త జంట బంధువు నిర్వాకం వల్ల వీరు జైలు పాలవడంతో వారిని విడుదల చేయించేందుకు ఎన్సీబీ అధికారులు ఖతార్ అధికారులతో దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన వధువు ఒనిబా తండ్రి ఎన్సీబీని సంప్రదించడంతో ఖతార్ జైలులో ఉన్న దంపతుల విడుదల కోసం యత్నిస్తున్నారు. నార్కొటిక్ కంట్రోలు బ్యూరో అధికారుల దర్యాప్తులో కొత్త దంపతులు మోసానికి గురయ్యారని తేలడంతో వారిని ఖతార్ జైలు నుంచి విడుదల చేయించాలని నిర్ణయించారు.