Food

మరమరాల్లో కూడా పలు రకాలు ఉన్నాయి

మరమరాల్లో కూడా పలు రకాలు ఉన్నాయి

అవేమీ అద్భుతమైన రుచిగానూ ఉండవు. పోషకాలూ అంతంతమాత్రమే. కానీ వాటిని చూస్తే ఎంత పెద్దవాళ్లయినా చిన్నపిల్లలైపోతారు. కనిపిస్తే కాసినయినా నోట్లో వేసుకోకుండా ఉండలేరు. అదే మరమరాల్లోని గొప్పతనం. అందుకే అవి ఇప్పుడు కొత్తకొత్తగా వస్తున్నాయి… భిన్న రుచుల్లో… విభిన్న రకాల్లో… పోషకాల్ని ఒంటపట్టించుకుని మరీ..!
మరమరాల్లో రకాలేమిటీ అనిపించడం సహజం. రెండు దశాబ్దాల క్రితం వరకూ మరమరాలు, బఠాణీలు, సెనగలు… అంటూ కేకలేసుకుంటూ సైకిళ్ల మీద వచ్చేవాళ్ల దగ్గర మాత్రమే మరమరాలు దొరికేవి. అవీ బియ్యంతో చేసినవే. ఇప్పుడు గోధుమ, రాగి, జొన్న, సజ్జ, బార్లీ, మొక్కజొన్న, స్వీట్‌కార్న్‌, క్వినోవా… ఇలా అన్ని రకాల తృణ, చిరుధాన్యాలతోనూ మరమరాలు తయారుచేస్తున్నారు. మరమరాలని పాకం పట్టి ఉండలు చుట్టడం, కాసిని కూరగాయ ముక్కలు, కారప్పూస, పప్పులు జోడించి మిక్స్చర్‌, బేల్‌పురి, ఉగ్గాణి వంటి చిరుతిళ్లను తయారుచేయడం వాడుకలో ఉంది. కొత్తగా వీటికి పప్పుధాన్యాలు చేర్చి చిక్కీలూ లడ్డూలూ చేస్తున్నారు. సలాడ్స్‌లోనూ మరమరాల్ని జోడిస్తున్నారు. మరమరాల్నే కురుమురా, మురమురా, బొరుగులు అనీ అంటారు. ఒకప్పుడు మరమరాలు అనేవి చిన్నపిల్లలు తినేవి మాత్రమే అనుకునేవారంతా. ఆకలి ఆకలి అని పిల్లలు విసిగించకుండా ఉంటారని కాసిని మరమరాలు ఇచ్చేవారు. పసిపిల్లలు ఏడుస్తుంటే కాసిని మరమరాలు ప్లేటులోనో నేలమీదో పోసిపెడితే, వాళ్లు ఏడుపు మానేసి వాటిని ఒక్కొక్కటిగా ఏరుకుని తినేవారు. వేళ్లతో వాటిని అలా పట్టుకోవడం వల్ల వాళ్లంతట వాళ్లు తినడం అలవాటవడంతోబాటు చేతులకీ కంటికీ మధ్య సమన్వయం కుదురుతుందనే శాస్త్రీయకోణం కూడా అందుకు కారణం కావచ్చు. పైగా ఇవి తేలికగా జీర్ణమవుతాయి.
**క్యాలరీలు తక్కువ..!
బరువు తగ్గాలనుకునేవాళ్లకి మరమరాలతో చేసే స్నాక్స్‌ తినడం వల్ల పొట్ట నిండినట్లూ ఉంటుంది. క్రేవింగూ తగ్గుతుంది. పావుకిలో మరమరాలు తింటే లభించేది 54 క్యాలరీలూ, 12గ్రా. కార్బోహైడ్రేట్లూ 0.98 ప్రొటీన్లూ కొద్దిపాళ్లలో పీచూ బి-విటమిన్లూ ఖనిజాలూ లభిస్తాయి. ఇవి పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. దాంతో జీర్ణక్రియ బాగుంటుంది. మలబద్ధకం ఉండదు. వీటిల్లోని విటమిన్‌-డి, కాల్షియం, ఐరన్‌, పీచు… వంటి పోషకాలు దంతాలు, ఎముకలకు బలాన్ని ఇస్తాయి. సోడియం తక్కువగా ఉండటం వల్ల బీపీ తగ్గుతుంది. మరమరాల్లో మెదడు ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి. వీటిని పొడి చేసి అందులో కాసిని నీళ్లుపోసి ఆ మిశ్రమాన్ని పట్టిస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
**ఎలా చేస్తారు?
బియ్యంలో కాసిని నీళ్లు లేదా నూనె కలిపి వెడల్పాటి బాండీల్లో ఇసుక లేదా ఊకల్లాంటివి వేసి అందులో బియ్యాన్ని వేసి వేయించి తీసి జల్లిస్తారు. లేదంటే బియ్యాన్ని కడిగి మరిగించిన నీళ్లలో వేసి కొద్దిగా ఉడికించి తీసి ఆరబెట్టి వేయించేవారు. కానీ ఇప్పుడా శ్రమంతా లేకుండా ప్రత్యేకంగా మెషీన్లు వచ్చాయి. గతంలో తెల్లనిబియ్యంతో మాత్రమే మరమరాలను తయారుచేసేవారు. పైపొట్టు తీసేయడంతో వాటిల్లో పోషకాల శాతం తక్కువగా ఉండేది. ఆరోగ్యస్పృహతో ఇప్పుడు ముడిధాన్యంతోనూ అందులోనూ అన్ని రకాల ధాన్యంతోనూ మరమరాలు తయారుచేస్తున్నారు. రకరకాల ఆకారాల కోసం ధాన్యాన్ని పిండి చేసి కూడా చేస్తున్నారు. దాంతో తెల్లని మరమరాలకన్నా ముడి బియ్యం, గోధుమ, జొన్న, మొక్కజొన్నలతో చేసే మరమరాల వాడకం రోజురోజుకీ పెరగడమే కాదు, వంటింటి దినుసుల జాబితాలోకి మరమరాల పేరూ చేరిపోయింది. అలా మురమురా అంతా మెచ్చే చిరుతిండిగా మారిపోయింది.