ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్ కతౌలీ తెహ్సిల్ జిల్లా ఫ్యామిలీ కోర్టు.. భర్తకు నెలవారీ భరణం ఇవ్వాల్సిందిగా ఓ ప్రభుత్వ ఉద్యోగినిని ఆదేశించింది. దాదాపు 9 సంవత్సరాల విచారణ తరువాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అయితే నెలకు 2వేలు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వడం గమనార్హం.కిషోరీలాల్ సోహుంకర్, మున్నాదేవీలకు 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దంపతులు 10ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. మున్నాదేవీ కాన్పూర్లోని భారత ఆర్మీలో నాలుగో గ్రేడ్ ఉద్యోగినిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ఆమెకు నెలకు 12వేల పింఛను వస్తోంది. కిషోరీలాల్ కతౌలీలో ఓ టీషాపు నడుపుతున్నాడు. అతని పేదరికం కారణంగా తన భార్యకు వచ్చే పింఛనులో కొంత ఇవ్వాలంటూ 9 ఏళ్ల క్రితం ముజఫర్నగర్లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో కోర్టు తీర్పును వెలువరించింది. కేసు ఇంకా పరిష్కారం కాలేదని కిషోరీలాల్ అడ్వకేట్ బలేష్ కుమార్ తయాల్ తెలిపారు. ఇద్దరు కలిసుండాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ మున్నీదేవి దానికి అంగీకరించలేదన్నారు. దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు.
“కోర్టు తీర్పుతో నాకు తృప్తి కలగలేదు. దాదాపు 9ఏళ్ల తరువాత కోర్టు తీర్పును వెలువరించింది. నేను రుణం తీసుకొని ఈకేసు కోసం పోరాడాను. 20ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. నాకు కేవలం రూ.2వేలు ఇవ్వాలని కోర్టు తెలిపింది. కానీ ప్రస్తుతం నా భార్య పింఛను రూ.12వేల కంటే ఎక్కువే వస్తోంది.”—కిషోరీలాల్ సోహుంకర్.