ప్రాచీన కాలం నుంచి వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. వేప చెట్టులోని ఒక్కో భాగం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. గృహవైద్యంతోపాటు పంటల్లో చీడపీడల నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. వేప పిండి, నూనె, కషాయం, చెక్క రూపంలో వాడుతారు. భూమిని సారవంతం చేయడంతోపాటు పంట ఉత్పత్తుల నిల్వలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎండిన వేప ఆకులను పెసర, మినుము, బియ్యం తదితర పంటలు నిల్వ చేసేందుకు ఎక్కువగా వినియోగిస్తారు. పంటల సాగులో వేప ఉత్పత్తులను విరివిగా వాడుతున్నారు. సేంద్రియ ఎరువుగానూ ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల వేప ఉత్పత్తులు, వాటి ఉపయోగాలను వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు వివరిస్తున్నారు.
*వేప నూనెతో అనేక లాభాలు
రసం పీల్చే పురుగులు, పొగాకు, లద్దె పురుగులు, కాండం తొలుచు పురుగుల నివారణకు వేప నూనె పని చేస్తుంది. లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల వేప నూనెను కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ వాసనకు ఆడ రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉండకుండా చేయడమే కాకుండా పెట్టిన గుడ్లను పొదగకుండా చేస్తుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన లార్వాలను సమర్థవంతంగా అరికడుతుంది. దీన్ని మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువగా పిచికారీ చేస్తే ఆకులు బిరుసుగా మారుతాయి. ఉదయం, సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. పూత సమయంలో పిచికారీ చేస్తే పూత రాలే అవకాశం ఉంటుంది. పూత దశకు ముందు, ఆ తరువాత పిచికారీ చేయాలి. రెక్కల పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లింగాకర్షక బుట్టలు ఎకరానికి నాలుగు నుంచి ఐదు ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతిని బట్టి పిచికారీ చేస్తే తక్కువ ఖర్చుతో పంట దిగుబడి సాధించవచ్చు. గొంగళి పురుగుపైన పిచికారీ చేస్తే ఆ పురుగు తరువాత దశను చేరుకోలేక చనిపోతుంది. కత్తెర పురుగు (పాత ఆర్మీ వామ్) ముఖ్యంగా మక్కజొన్న, పసుపు ఇతర పంటలను ఆశించి నష్టపరుస్తుంది. దీని నివారణకు 10 వేల పీపీఎం అజాడిరక్టిన్‌ను పిచికారీ చేస్తే ఈ పురుగు అదుపులో ఉంటుంది.
*వేప పిండితో తెగుళ్ల నివారణ
వేప పిండితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంటల్లో చీడపీడల నివారణలో ఎరువుగా వినియోగిస్తున్నారు. ఎకరానికి నాలుగు నుంచి ఐదు బస్తాల వేప పిండి చల్లడం ద్వారా కీటకాలను నివారించొచ్చు. వేరుకుళ్లు, దుంపకుళ్లు, దుంప ఈగ వంటి తెగుళ్లను సమర్థవంతంగా నివారిస్తుంది. ఎండు తెగులు నివారణకు ఉపయోగించే ట్రైకోడర్మాతోపాటు 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండి వాడితే చాలా ప్రయోజనం ఉంటుంది. యూరియా వాడేటప్పుడు 5 కిలోల యూరియాకు కిలో వేప పిండి కలిపి వేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వేప పిండి యూరియాపై ఒక పొరలా ఏర్పడుతుంది. దీంతో ఎరువు తొందరగా కరిగిపోదు.
*వేప గింజల కషాయం.. పంటకు రక్ష
వేప గింజల పొడిని ఒక గుడ్డలో కట్టి 10 లీటర్ల నీటిలో 10 గంటల పాటు నానబెట్టి కషాయం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన కషాయాన్ని వంద లీటర్ల నీటిలో వంద గ్రాములు కలిపి ఎకరానికి పిచికారీ చేస్తే పురుగు గుడ్డు దశ, కోశస్థ దశ, ప్యూపా దశలను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
*దిగుబడులు పెంచే వేప చెక్క
వేప నుంచి నూనె తీశాక చెక్క మిగులుతుంది. ఈ వేప చెక్కలో నత్రజని నాలుగు నుంచి ఆరు శాతం, భాస్వరం, పొటాష్ 0.5 శాతం ఉంటాయి. సల్ఫర్ కూడా ఉంటుంది. నూనె గింజ పంటల్లో దిగుబడి పెంచడంలో సల్ఫర్ తోడ్పడుతుంది.
వేపచెట్లతో కోట్లు గడిస్తున్నారు
Related tags :