* అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా ఆర్‌జీఐఏ ఘనత సాధించింది. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో అంతర్గతంగా ఈ-బోర్డింగ్‌కు రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని పొందిన మొదటి ఎయిర్‌లైన్స్‌గా ఇండిగో గుర్తింపు పొందింది. భారత విమానయాన రంగంలోనే ఇదొక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ-బోర్డింగ్ సేవల ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత భద్రత చేకూరనున్నట్లు చెప్పారు.
* కరోనా కట్టడిలో ఆశలు రేకెత్తిస్తోన్న ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగదశలో యువత, వృద్ధుల్లో ఒకేరకమైన రోగనిరోధక ప్రతిస్పందనను కలిగిస్తున్నట్లు ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైందని ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా ప్రకటించింది. కాగా, దీనిపై మంగళవారం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. ప్రాథమికంగా ఇది చాలా మంచి వార్తంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
* సిద్దిపేటలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ తన కార్యాలయంలోనే నిర్బంధ దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను వైద్యులు పరీక్షించారు. షుగర్ లెవల్స్ పడిపోతుండటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భాజపా అధిష్ఠానం గంట గంటకూ సంజయ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. ఆయన్ను పరామర్శించేందుకు పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు కరీంనగర్ చేరుకుంటున్నారు.
* జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో ఇకపై ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన భూ చట్టాల నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం భారతీయ పౌరులెవరైనా జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో భూవిక్రయాలు జరపవచ్చు. జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసిగా ఉన్నవారే అక్కడ భూమి కొనుక్కోవచ్చని గతంలో ఉన్న డొమిసైల్ ఆప్షన్‌ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా తొలగించింది.
* భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఇందు కోసం వారు దిల్లీలో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్, అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. గత 2 దశాబ్దాలుగా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొవడం చాలా ముఖ్యమని, దీనికి భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు.
* రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా రాష్ట్ర భాజపా నేతలు మాత్రం గొప్పలు చెబుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాల్లో కేంద్రం వాటా ఉందని దుబ్బాకలో భాజపా నేతలు ప్రచారం చేస్తున్నారని.. ఈ పథకాల్లో ఒక్కరూపాయైనా వాటా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వంతో అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. దివంగత రామలింగారెడ్డి అందించిన సేవలే దుబ్బాకలో తమ పార్టీకి విజయాన్ని చేకూరుస్తాయని తలసాని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో సోమవారం జరిగిన పరిణామాలు, భాజపా నేతల వ్యవహారశైలిపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో ప్రచారం కోసం ప్రణాళిక ప్రకారమే సిద్దిపేటలో భాజపా హడావుడి చేసిందని ఆరోపించారు. దొంగతనం మీరు చేసి వేరే వాళ్లపై నెడతారా? అని భాజపాను ఉద్దేశించి తలసాని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఘటనపై సిద్దిపేట సీపీ వీడియో విడుదల చేయకపోతే ప్రజల్లో చాలా అనుమానాలు వచ్చేవన్నారు.
* ప్రస్తుతం బిహార్‌లో అధికారంలో ఉన్న పార్టీ గాడితప్పిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. వారు చెప్పే మాటలు కానీ.. చేసే పనులు కానీ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు నిరాశకు గురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో బిహార్ ప్రజలంతా మహాకూటమి వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. రేపు బిహార్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రజలనుద్దేశించి మంగళవారం ఆమె వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ఈ వీడియోను తన ట్విటర్ వేదికగా రాహుల్‌గాంధీ విడుదల చేశారు. సరికొత్త బిహార్ నిర్మాణం కోసం మహాకూటమిని గెలిపించాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ పిలుపునిచ్చారు.
* చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకురావాలని కోరుతూ రామకుప్పం మండలంలో తెదేపా నేతలు సోమవారం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో నేతల గృహ నిర్బంధాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మంగళవారం లేఖ రాశారు.
* వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత నిధులను మంగళవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. మొత్తం 50.07 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,114 కోట్లు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు. 50లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందంటే సంతోషంగా ఉందన్నారు. 41,000 అటవీ భూముల సాగుదార్లకు కూడా సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి సహాయం అందుతోందన్నారు.
* వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తనపై ప్రభుత్వం అకారణంగా కేసులు నమోదు చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఆవేదనలో ఉంటే కనీసం వారిని పలకరించని ముఖ్యమంత్రి జగన్.. బాధితులకు భరోసా కల్పించేందుకు వెళ్లిన తనపై కేసులు పెడుతున్నారని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రతి ఊరూ వెళ్లి కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడుస్తానని లోకేశ్ అన్నారు. తనపై కేసులు పెట్టేందుకు ఎలాంటి సెక్షన్లు దొరక్క ట్రాక్టర్ నడిపానని, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించానంటూ కేసులు పెడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
* రాజధాని అమరావతిపై భాజపాకు స్పష్టమైన అవగాహన ఉందని, పూర్తి నిబద్ధతతో ఉన్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. హైకోర్టు కర్నూలులోనే ఉండాలని తమ పార్టీ తీర్మానం చేసిందన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని… రాజధానిపై తమకున్న స్పష్టత తెదేపా, వైకాపాకు లేవని విమర్శించారు. అమరావతి పరిధిలోని రైతులకు 64వేల ప్లాట్లు వెంటనే ఇవ్వాలని.. రాజధాని గ్రామాల్లో 9వేల ఎకరాలు అభివృద్ధి చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆవ భూములు, హిందూ దేవాలయాలపై దాడులు, ఆలయ భూముల ఆక్రమణ అంశాల్లో తాము పోరాటం చేశామని.. అవినీతిపై తెదేపా, వైకాపా రెండింటినీ సహించేది లేదన్నారు.
* ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలను సీఎం జగన్ విడుదల చేశారు. 13 శాఖల పరిధిలో మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో పలు దఫాలుగా పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు 10.56లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 7.68లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థుల మెరిట్ జాబితాను గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఓపెన్, బీసీ కేటగిరీలో అత్యధికంగా 111 మార్కులు రాగా.. ఎస్సీలో 99.75, ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 82.75 మార్కులు వచ్చాయి.