Politics

నిమ్మరసం తాగి దీక్ష విరమించిన బండి సంజయ్

నిమ్మరసం తాగి దీక్ష విరమించిన బండి సంజయ్

తన కార్యాలయంలో నిర్బంధ దీక్షకు దిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. ఆయన షుగర్‌ లెవెల్స్‌ పడిపోతుండటంతో ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అనంతరం హుటాహుటిన అంబులెన్స్‌లో నగరంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి తరలించారు. సంజయ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో భాజపా కార్యకర్తలు భారీగా ఆయన కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

సిద్దిపేటలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ కరీంనగర్‌లోని తన కార్యాలయంలోనే నిర్బంధ దీక్షకు దిగారు. ఈ సాయంత్రం ప్రభుత్వ వైద్యులు ఆయన్ను పరీక్షించి బీపీ, షుగర్‌ లెవెల్స్‌ను పరిశీలించి ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. దీక్షకు దిగి సుమారు 24 గంటలు గడుస్తుండటంతో సంజయ్‌ ఆరోగ్యం ఒకింత ఆందోళనకరంగా మారింది. ఆయన షుగర్‌ లెవెల్స్‌ 55కి పడిపోయాయి. ఈ క్రమంలో సంజయ్‌ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నేతలే సంజయ్‌ను నగరంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ భాజపా నేతలు వివేక్‌, జితేందర్‌రెడ్డి సంజయ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. మరోవైపు భాజపా అధిష్ఠానం గంట గంటకూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది.

దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట పోలీసు కమిషనర్‌ దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని, ఆయన్ని బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సంజయ్‌ దీక్ష చేపట్టారు. సీపీని బదిలీ చేసి ఆయనపై కేసు నమోదు చేసేవరకు తన కార్యాలయంలోనే ఉంటానని ప్రకటించి దీక్షకు దిగారు. బయటి నుంచి తాళం వేసుకుని నిన్న రాత్రి నుంచి కార్యాలయంలో నేలపైనే దీక్ష కొనసాగించారు. దీక్షలో ఉన్న సమయంలో భాజపా కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌ తదితరులు సంజయ్‌ను పరామర్శించారు. పోలీసులు తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని.. సిద్దిపేట సీపీని వెంటనే విధుల నుంచి తప్పించాలని వివేక్‌ డిమాండ్‌ చేశారు.