ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. దసరా సందర్భంగా ఈ ఏడాది 2,36,182 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. 85,058 మంది భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు తీసుకున్నారని, వారిలో దాదాపు 35వేల మంది భక్తులు దర్శనానికి రాలేకపోయినట్లు గుర్తించామన్నారు. ఆన్‌లైన్‌తోపాటు దూరప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన వారికి ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా 1,51,124 టికెట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, పరోక్ష కుంకుమార్చనలు, చీరల వేలం, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి రూ.4.36కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు వివరించారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించామని.. కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చక్కగా సహకరించారని చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నిర్వహించినట్లు వివరించారు. మూలానక్షత్రం రోజున కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించి.. దేవాలయ అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు.
దుర్గమ్మకు ₹4.36కోట్ల ఆదాయం
Related tags :