* ఈ ఏడాది చివరి కల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్ సాధ్యమేనని అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ తాజా ప్రకటనలో వెల్లడించింది. క్లినికల్ పరీక్షలు అనుకున్న విధంగా జరిగి.. అధికారిక అనుమతులు సకాలంలో లభిస్తే 2020 ముగిసేలోపే కొవిడ్ వ్యాక్సిన్ తయారీ సాధ్యమేనని సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. తాము వ్యాక్సిన్ తయారీలో చివరి అంకంలో ఉన్నామని.. ప్రజారోగ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు అతి ముఖ్యమైన ఈ విషయంలో ఓర్పు వహించటం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరాంతానికల్లా 40 మిలియన్ డోసులు.. మార్చి 2021 కల్లా 100 మిలియన్ డోసులు అందజేసేందుకు ఫైజర్ అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
* దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా, రష్యా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం మదుపరుల్లో భయాలు నెలకొన్నాయి. కరోనా కట్టడికి ఇప్పటికే యూరోపియన్ ప్రభుత్వాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించడం వంటి పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. ఆ ప్రభావం మన మార్కెట్ల మీద పడింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాలు చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 40వేల పాయింట్ల దిగువకు చేరగా.. నిఫ్టీ 11,700 పైన స్థిరపడింది.
* వారం పాటు సాగిన పండుగ విక్రయాల్లో సింహభాగం సొంతం చేసుకొని ఫ్లిప్‌కార్టు ముందంజలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఆన్‌లైన్‌లో విక్రయాలు 55శాతం పెరిగి 4.1 బిలియన్ డాలర్లకు(రూ.29 వేల కోట్లు) చేరాయి. గతేడాది ఈ విక్రయాలు కేవలం 2.7 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది విక్రయాల్లో 68శాతంను ఫ్లిప్‌కార్టు ఒడిసిపట్టింది.
* ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తమ భారత కార్యకలాపాలకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజేశ్ నంబియార్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగానూ చేరుస్తున్నట్లు తెలిపింది. నవంబరు 9 నుంచి ఆయన నియామకం అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన నెట్‌వర్కింగ్, సిస్టమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సియెనా ఇండియా ఛైర్మన్‌గా ఉన్నారు.
* మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 9:49 గంటల సమయంలో సెన్సెక్స్ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 40,527 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 13 పాయింట్లు ఎగబాకి 11,901 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.80 వద్ద కొనసాగుతోంది. అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండడం మదుపర్ల అప్రమత్తతకు కారణమవుతోంది.
* దేశంలో ఆర్థిక రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. వలస కార్మికుల నుంచి నగదు బదిలీ పెరగడం; ఉద్యోగంలో చేరాక ఈపీఎఫ్‌ఓ చేసే నమోదులు లాక్‌డౌన్ ముందు స్థాయిలకు చేరడం దీనికి నిదర్శనమని పేర్కొంది. జన్‌ధన్ ఖాతాల సంఖ్య కూడా 60 శాతం పెరిగి 41 కోట్లకు పైగా చేరడంతో పాటు వాటిల్లో నగదు జమలు కూడా వృద్ధి చెందాయని మంగళవారం ఎస్‌బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక వివరించింది.