రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి, వరిపైర్లకు అపార నష్టం వాటిల్లింది. కోతకు వచ్చేదశలో కురిసిన వానలతో చాలాప్రాంతాల్లో వరిపైర్లు నేలవాలాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గి, పొలాల్లోని నీరు బయటకు వెళ్లిపోయినా పైరు కోలుకోలేదని, దిగుబడి సైతం తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షపునీటిలో నేలవాలిన వరిధాన్యం కంకులపైనే గింజలు మొలకలు వస్తున్నాయి. వరిపైరు నీళ్లలో రోజుల తరబడి మునిగినందున ధాన్యపు కంకుల్లో తాలుగింజలూ ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో 60.22 లక్షల ఎకరాల్లో పత్తి, 52.56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో సన్నరకాల వరి వంగడాలతో సాగైన విస్తీర్ణమే 70 శాతం వరకూ ఉంది. అధిక వర్షాలతో వరి కంకులు నీటమునిగిన ప్రాంతాల్లో తాలు గింజలు ఎక్కువగా ఏర్పడటంతో వరి ధాన్యం నాణ్యతగా రావడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం నాణ్యతగా లేకపోతే మద్దతు ధర లభించదు. కొన్ని ప్రైవేటు కంపెనీలు విక్రయించిన సన్నరకం వరి వంగడాలతో సాగుచేసిన పైర్లు అధిక వర్షాలకు తట్టుకోలేకపోయాయని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. వీటికి తెగుళ్ల తాకిడి కూడా ఎక్కువగా ఉన్నందున చాలా ఎక్కువగా పాడైనట్లు వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ ‘ఈనాడు’కు చెప్పారు. వరి పొలాల్లో నీరు నిలిస్తే బయటకు పంపేలా ఏర్పాట్లు చేయాలని రైతులకు సూచించారు. నేలవాలిన వరిపైరును లేపి నిలబెట్టాలని, కిందపడిన పైరు కంకులు మొలకెత్తకుండా లీటరు నీటిలో 50 గ్రాముల చొప్పున ఉప్పు కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. పూతదశలో ఉన్న పైర్లకు కాటుక తెగులు లేదా గింజమచ్చ తెగులు ఆశించకుండా లీటరు లీటిలో 200 మిల్లీలీటర్ల ప్రొపికొనజోల్ అనే మందును కలిపి చల్లాలని సూచించారు. త్వరలో రైతుల పొలాలను పరిశీలించి పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదికను తయారుచేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా.
వరి కంకులకు మొలకలు
Related tags :