* ఈ ఏడాది చివరి కల్లా కరోనా వైరస్ వ్యాక్సిన్ సాధ్యమేనని అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ తాజా ప్రకటనలో వెల్లడించింది. క్లినికల్ పరీక్షలు అనుకున్న విధంగా జరిగి.. అధికారిక అనుమతులు సకాలంలో లభిస్తే 2020 ముగిసేలోపే కొవిడ్ వ్యాక్సిన్ తయారీ సాధ్యమేనని సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. తాము వ్యాక్సిన్ తయారీలో చివరి అంకంలో ఉన్నామని.. ప్రజారోగ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు అతి ముఖ్యమైన ఈ విషయంలో ఓర్పు వహించటం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరాంతానికల్లా 40 మిలియన్ డోసులు.. మార్చి 2021 కల్లా 100 మిలియన్ డోసులు అందజేసేందుకు ఫైజర్ అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
* తితిదే ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు సాయికృష్ణ ఆ పదవిలో కొనసాగనున్నారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు సాయికృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల నుంచి ఆయన కుటుంబం వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణను ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.
* గుంటూరులో రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఓవైపు పబ్లిక్ పోలీసింగ్ అంటూ మరో వైపు అన్నదాతల పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగిన నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రైతులను తీసుకెళ్లిన ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఐ, ఆర్‌ఐలకు ఎస్పీ విశాల్ గున్నీ ఛార్జి మెమోలు జారీ చేశారు.
* నగర శివారు రాజేంద్రనగర్‌లో పట్టపగలే కిడ్నాప్‌కు గురైన దంతవైద్యుడి కేసును ఏపీలోని అనంతపురం పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితుల నుంచి 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు, బొమ్మ తుపాకులు స్వాధీనం చేసున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు.
* నగర శివారు రాజేంద్రనగర్‌లో పట్టపగలే కిడ్నాప్‌కు గురైన దంతవైద్యుడి కేసును ఏపీలోని అనంతపురం పోలీసులు ఛేదించారు. దంతవైద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న బెహజత్ హుస్సేన్‌ను కొందరు దుండగులు నిన్న మధ్యాహ్నం బుర్ఖాలో వచ్చి కిడ్నాప్ చేశారు. సైబరాబాద్ పోలీసుల సమాచారం మేరకు బెంగళూరు వైపు తీసుకెళ్తుండగా అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి నుంచి 44వ జాతీయ రహదారిపై కాపలాకాసిన పోలీసులు.. రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను నిలువరించారు. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ జరిగిన 12 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. నిందితుల నుంచి 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు, బొమ్మ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
* రాజధాని అమరావతి రైతులకు వేసిన సంకెళ్లే.. జగన్ ప్రభుత్వానికి ఉరితాళ్లుగా మారతాయని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు. అమరావతి రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్లినందుకు నిరసనగా గుంటూరు జిల్లా జైలు వద్ద జరిగిన ఆందోళనలో పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీ అహంకారం పరాకాష్ఠకు చేరిందని.. దళితుల రక్షణ కోసం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని వారిపైనే ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. కేసు పెట్టిన వ్యక్తి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నా.. పోలీసులు రైతులను అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు. తనకు ఓట్లు వేసిన దళితులపై జగన్ పగతీర్చుకుంటున్నారని ఆనందబాబు వ్యాఖ్యానించారు.
* బ్యాంకులను మోసం చేసిన కేసులో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన వ్యాపారవేత్త పోలేపల్లి వెంకటప్రసాద్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. తణుకులో వెంకటప్రసాద్, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న 21 స్థిరాస్తులతోపాటు, రూ.50 లక్షల నగదును జప్తు చేశారు. స్థిరాస్తుల విలువ సుమారు రూ. 7.57కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు.
* బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. కాగా.. పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ తాజాగా వివాదానికి తెరతీసింది. తొలి దశ ఎన్నికలపై బిహార్ ప్రజలకు అభినందనలు తెలిపిన రాహుల్.. న్యాయం, ఉపాధి, రైతులు, కార్మికుల కోసం ఈ సారి మీ ఓటు మహాకూటమికే వేయాలి అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఇలాంటి ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై భాజపా ఎన్నికల కమిషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
* నగరంలోని గోడెకి ఖబర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోడెకి ఖబర్‌లో 192 డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇప్పటికే పూర్తైన 139 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వృద్ధులు, వికలాంగులకు కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఇవాళ ‘మిగిలిన ఇళ్లు.. దళారుల కళ్లు’ పేరుతో ‘ఈనాడు’ దినపత్రికలో వచ్చిన కథనానికి మంత్రి స్పందించారు. జియాగూడలో దళారులు రెచ్చిపోతున్నారని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ప్రజలు అలాంటి వారిని నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కలెక్టర్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
* గుంటూరులో రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఘటనపై తెలుగుదేశం పార్టీ (తెదేపా) సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన దృశ్యాలను జతపరుస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆయన లేఖ రాశారు. కరుడు కట్టిన నేరస్థులు, దేశ భద్రతకు భంగం కలిగించే వారికి వేసినట్లుగా అమరావతి రైతులకు సంకెళ్లు వేయడం అత్యంత దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా రైతుల పట్ల తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం న్యాయవ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను వర్ల కోరారు.
* బుధవారం మొదటి దశ పోలింగ్ ఉన్న నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత ప్రచారానికి సోమవారంతో తెరపడింది. ఈ క్రమంలో ‘కుమారుడి కోసం తపన వల్లే వారికి తొమ్మది మంది సంతానం’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిన్న పరోక్షంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. తాజాగా వాటిపై స్పందించిన తేజస్వి అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. మహిళలు, మా అమ్మ మనోభావాలను ఆయన కించపర్చారని విమర్శించారు. కాగా, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీ దంపతుల తొమ్మిది మంది సంతానంలో ఈ యువనేత ఎనిమిదో వాడు.
* బ్యాంకులను మోసం చేసిన కేసులో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన వ్యాపారవేత్త పోలేపల్లి వెంకటప్రసాద్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. తణుకులో వెంకటప్రసాద్, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న 21 స్థిరాస్తులతోపాటు, రూ.50 లక్షల నగదును జప్తు చేశారు. స్థిరాస్తుల విలువ సుమారు రూ. 7.57కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు.
* టీ20 క్రికెట్ లీగ్‌లో భాగంగా 48వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో వచ్చే ఫలితం ప్లేఆఫ్స్ జట్టును నిర్ణయించనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబయి, బెంగళూరు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గెలిచిన జట్టు దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో వేర్వేరుగా ఓడిన ఈ రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బెర్తు ఖరారు చేసుకోవాలని తహతహలాడుతున్నాయి.
* ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజ సంకేతాలు కన్పిస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) జీడీపీ వృద్ధి సున్నాకి సమీపంలో లేదా స్వల్ప క్షీణతను నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్- జూన్) జీడీపీ వృద్ధిరేటు గణనీయ స్థాయిలో 23.9 శాతం క్షీణించడం ఇందుకు కారణమని తెలిపారు. ప్రస్తుత పండగ సీజనులో గిరాకీ పుంజుకోవడం సానుకూల అంశంగా ఆమె పేర్కొన్నారు.
* భాజపా, జేడీయూ కూటమి బిహార్‌ను ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన చంపారన్‌లో మాట్లాడుతూ..అధికార పార్టీలపై మండిపడ్డారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ చివరి సారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మీతో కలిసి టీ తాగుతానని అన్నారు. మీతో టీ తాగారా?’ అంటూ ర్యాలీకి హాజరైన ప్రజలను రాహుల్ ప్రశ్నించారు.
* తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు దుబ్బాక ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. బుధవారం దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడిగా రెండు పంట కాలాల్లో కలిపి రూ.10వేలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇవన్నీ గమనిస్తూ.. ప్రజలంతా ఆలోచించి తమ ఓటును వేయాలి’’ అని హరీశ్ అన్నారు.