DailyDose

గీతం వర్శిటీపై కేంద్రానికి ఫిర్యాదు-తాజావార్తలు

గీతం వర్శిటీపై కేంద్రానికి ఫిర్యాదు-తాజావార్తలు

* ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) నూతన పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2020-2030 కాలానికి ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన విధానాలను వెల్లడిస్తూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా నూతన విధానాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. తాజా విధానాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. రాష్ట్రంలోనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారికి పలు రాయితీలను ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా తొలి 2 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, 20వేల ఆటోలు, మొదటి 5వేల 4 చక్రాల వాహనాలు, మొదటి 10వేల లైట్‌ గూడ్స్‌ వాహనాలు, మొదటి 5వేల ఎలక్ట్రిక్‌ కార్లు, 500 ఎలక్ట్రిక్‌ బస్సులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ రుసుం మినహాయింపు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్‌ రుసుం పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపింది. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్‌ అవసరాల కోసం అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

* బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన ‘జంగిల్‌ రాజ్‌ కా యువరాజ్’ వ్యాఖ్యలపై మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ స్పందించారు. అవినీతి, నిరుద్యోగం, వలస కార్మికుల సంక్షోభం వంటి అసలైన సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోకుండా.. అనవసరమైన వ్యాఖ్యలు చేశారని కౌంటర్‌ ఇచ్చారు. గురువారం తేజస్వీ యాదవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మోదీ దేశానికి ప్రధానమంత్రి. ఆయన ఏమైనా మాట్లాడొచ్చు. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించదలచుకోలేదు. కానీ ఆయన నిన్న బిహార్‌కు వచ్చి నిరుద్యోగం, పేదరికం, అవినీతి వంటి కీలక సమస్యలపై మాట్లాడలేదు. భాజపా అతిపెద్ద పార్టీ.. ప్రచారం కోసం వారు 30 హెలికాప్టర్లు ఉపయోగిస్తారు.. ఇలాంటి అనవసర విషయాలు మాత్రమే ప్రస్తావించారు. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రజలకు మాత్రం అన్నీ తెలుసు. పేదరికం, పరిశ్రమలు, రైతులు, నిరుద్యోగం వంటి అంశాలను మోదీ మాట్లాడాలి’’ అని తేజస్వీ పేర్కొన్నారు.

* అధికారం కోసం వైరాన్ని మరిచి చేతులు కలిపిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) మిత్రబంధం ఎంతో కాలం నిలవలేదు. సార్వత్రిక ఎన్నికల కోసం కలిసిన ఈ రెండు పార్టీలు ఏడాది తిరగకుండానే విడిపోయి మళ్లీ పాత శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా బీఎస్పీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌‌ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమను మోసం చేసిన సమాజ్‌ వాదీ పార్టీని రానున్న మండలి, రాజ్యసభ ఎన్నికల్లో దారుణంగా ఓడిస్తామని, ఇందుకోసం అవసరమైతే భాజపా లేదా ఇతర పార్టీ అభ్యర్థులకు తమ పార్టీ ఓటేస్తుందని బహిరంగంగా వ్యాఖ్యానించారు.

* యూజీసీ నిబంధనలను విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం అతిక్రమించిందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి, యూజీసీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తూ ఆయన లేఖ రాశారు. గీతం యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినందున వర్సిటీ హోదాను ఉపసంహరించాలని.. వాస్తవాలు తెలుసుకునేందుకు సత్వరమే విచారణ జరపాలని విజయసాయిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను గీతం వర్సిటీ ఆక్రమించిందని, ఈ వ్యవహారంపై విశాఖ ఆర్డీవో విచారణ జరిపారని తెలపారు. పలు ఉల్లంఘనల దృష్ట్యా ఆ వర్సిటీకి నోటీసులు జారీ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.

* దుబ్బాక నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు మొత్తం భాజపానే గెలుస్తుందని చెప్తున్నాయన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. రోజు రోజుకూ దుబ్బాకలో భాజపాకి ఆదరణ పెరుగుతోందన్నారు.

* సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం కోసం తమిళనాట ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని అనుకుంటున్నట్లు సోషల్‌మీడియాలో ఓ లేఖ వైరల్‌ అవడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. దీంతో స్పందించిన రజనీ.. ఆ లేఖ తాను రాసింది కాదని చెప్పారు. అయితే రాజకీయ ప్రవేశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

* పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమ పట్ల మాన్సాస్‌ ట్రస్టు ఛైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు వ్యవహరించిన తీరుపై ఆనంద గజపతిరాజు మరో కుమార్తె పూసపాటి ఊర్మిళ గజపతి మండిపడ్డారు. గురువారం తమ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన తల్లితో కలిసి ఆమె మాట్లాడారు. పైడితల్లి అమ్మవారి పండగలో ఏటా పాల్గొనటం తమ కుటుంబ సంప్రదాయమన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా సిరిమాను దర్శనానికి తన తల్లితో కలిసి వచ్చానని ఊర్మిళ చెప్పారు.

* నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

* రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర గడవకుండానే ప్రజలపై రూ.60వేల కోట్ల భారం మోపిందని తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలలో గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. ప్రజల ఆదాయం తగ్గిపోయిందని, లక్షలాది మంది పేదలకు సంక్షేమాన్ని దూరం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేశారని దుయ్యబట్టారు. తెదేపాపై ప్రతీకారంతో ప్రజలమీద కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

* కరోనా వైరస్‌ విజృంభణతో వణుకుతున్న దిల్లీ ప్రజలను చలి మరింత బెంబేలెత్తిస్తోంది. దిల్లీలో గురువారం రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 26 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు తొలిసారి 12.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దిల్లీలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉండేవని తెలిపింది. అయితే, 1994 అక్టోబర్‌ 31న తొలిసారి అత్యంత కనిష్ఠంగా 12.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారి కుల్దీప్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే, అంతకుముందు 1937 అక్టోబర్‌ 31న దిల్లీలో 9.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆల్ టైం రికార్డు అని తెలిపారు. చల్లగా వీచే గాలులతో పొగమంచు ఏర్పడటం కూడా ఉష్ణోగ్రతలు తగ్గడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

* కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఓవైపు ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు కరోనా కట్టడిలో విఫలమవుతుండగా యూరప్ దేశాలు మరోసారి లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులతో ప్రపంచ దేశాలు రికార్డులు నమోదు చేస్తుంటే.. తైవాన్‌ మాత్రం మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గడిచిన 200 రోజుల్లో స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది. 2.3కోట్ల జనాభా కలిగిన తైవాన్‌లో ఇప్పటివరకు కేవలం 550 కేసులు మాత్రమే నమోదుకాగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కఠినంగా వ్యవహరించిన తైవాన్‌, ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 88,778 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,905 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. 16 మంది బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,14,784కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,659 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 3,243 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,84,752కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,268 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 78,62,459 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

* జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనేది పేదవారి కోరిక. మధ్యతరగతివాళ్లు ఒక్కసారి విమానమెక్కి జీవితాంతం గొప్పగా చెప్పుకుంటారు. ఇక సంపన్నులు, వ్యాపారవేత్తలు, సినీ తారలైతే పనుల నిమిత్తం, విహార యాత్రలంటూ తరచూ విమానాల్లో విదేశాలకు వెళ్తూ ఉంటారు. సామాన్యుడి జీవితంలో బస్సు ప్రయాణం ఎంత సాధారణమో.. వారికి విమాన ప్రయాణాలు అంత సాధారణం. వారంతా వారానికి, పదిరోజులకు ఒకసారి విమాన ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో 250 రోజులు విమానంలోనే ప్రయాణిస్తున్నాడు. అవాక్కయ్యారా!?మీరు చదివింది నిజమే. ఇటీవల విమాన ప్రయాణంలో ఓ రికార్డు కూడా సాధించాడు.

* రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. తాగునీటితో పాటు సాగునీటి అవసరాలు ఉన్నాయని అభిప్రాయపడిన ఎన్జీటీ ..ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసింది.

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈనెల 31న మధ్యాహ్నం 12.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వేదికను ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. రైతు వేదిక ఏర్పాటు ఉద్దేశం, ఆవశ్యకత, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం వివరిస్తారు. అంనతరం రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని కూడా సీఎం సందర్శించనున్నారు.