* ఓ వైపు కొవిడ్ విజృంభణ, ఆర్థిక వ్యవస్థ మందగమనం.. మరోవైపు రెక్కలొచ్చిన ధరలు.. ఫలితంగా దేశంలో బంగారం గిరాకీ అంతకంతకూ పడిపోయింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 30శాతం తగ్గి 86.6 టన్నులకు పరిమితమైంది. 2019 ఇదే త్రైమాసికంలో పుత్తడి డిమాండ్ 123.9 టన్నులుగా ఉంది. నగల గిరాకీ కూడా 48శాతం తగ్గి 52.8టన్నులకు పడిపోయింది. ఈ మేరకు ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక వెల్లడించింది.
* జులై- సెప్టెంబరు త్రైమాసికంలో బజాజ్ ఆటో నికర లాభం 21.62 శాతం క్షీణించి రూ.1,193.27 కోట్లకు పరిమితమైంది. 2019-20 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.1,523.31 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.7,707.32 కోట్ల నుంచి రూ.7,155.86 కోట్లకు తగ్గింది. మొత్తం అమ్మకాలు 11,73,591 వాహనాల నుంచి 10 శాతం తగ్గి 10,53,337 కు పరిమితమయ్యాయి. అయితే ద్విచక్రవాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 5,50,194 కు చేరాయి. ‘సమీక్షా త్రైమాసికం తొలి అర్ధభాగంలో దేశీయ ద్విచక్రవాహన అమ్మకాలు బలంగా పుంజుకుంటున్నాయి. అయితే అసలైన పండగ సీజను కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికైతే సానుకూల సంకేతాలే కన్పిస్తున్నాయ’ని బజాజ్ ఆటో పేర్కొంది. రెండో త్రైమాసికంలో వాహన పరిశ్రమ 7 శాతం వృద్ధిని నమోదు చేయగా.. తమ వృద్ధి అదే స్థాయిలోనే ఉందని తెలిపింది. ‘2019-20 తొలి అర్ధభాగంలో 18.1 శాతంగా ఉన్న మా మార్కెట్ వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 18.2 శాతానికి పెరిగింద’ని కంపెనీ పేర్కొంది. అయితే దేశీయ వాణిజ్య వాహన అమ్మకాల్లో స్తబ్దత కొనసాగుతోందని తెలిపింది.
* సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన ఏషియన్ పెయింట్స్ నికర లాభం స్వల్పంగా 1.15 శాతం పెరిగి రూ.851.90 కోట్లకు చేరింది. 2019-20 ఇదే సమయంలో నికర లాభం రూ.842.14 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం కూడా రూ.5,155.82 కోట్ల నుంచి 5.37 శాతం పెరిగి రూ.5,432.86 కోట్లకు చేరింది. గిరాకీ క్రమక్రమంగా పుంజుకోవడంతో అన్ని వ్యాపార విభాగాలు రాణించాయని ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అమిత్ సింగల్ తెలిపారు. అలంకరణ ఉత్పత్తుల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.3.35ను (335%) మధ్యంతర డివిడెండుగా చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
* ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంబుజా సిమెంట్స్ రూ.804 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన నికర లాభం రూ.533.85 కోట్లతో పోలిస్తే ఇది 50.51 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.6,077.29 కోట్ల నుంచి 1.51 శాతం పెరిగి, 6,169.47 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.5,400.94 కోట్ల నుంచి రూ.5,144.38 కోట్లకు తగ్గాయి. స్టాండలోన్ ప్రాతిపదికన, అంబుజా సిమెంట్స్ నికర లాభం రూ.234.61 కోట్ల నుంచి ఏకంగా 87.77 శాతం పెరిగి, రూ.440.53 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం 8.63 శాతం వృద్ధితో రూ.2,852.46 కోట్లకు చేరింది. విక్రయాల పరిమాణానికొస్తే గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికం నాటి 5.23 మిలియన్ టన్నుల నుంచి 8.41 శాతం పెరిగి, 5.67 మిలియన్ టన్నులకు చేరింది. ‘కార్యకలాపాల్లో సమర్థనీయత, వ్యయ నియంత్రణ చర్యలతో బలమైన వృద్ధి సాధించాం. అలాగే పరిమాణంలోనూ మంచి గణాంకాలు నమోదు చేయగలిగాం. దీంతో ఎబిటా లాభం 55 శాతం వృద్ధి చెంది, మార్జిన్ 710 బేసిస్ పాయింట్ల (7.1%) మేర పెరిగింద’ని అంబుజా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నీరజ్ అఖోరీ వెల్లడించారు.
* ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.150 లక్షల కోట్లు) మార్కెట్ విలువను అధిగమించిన తొలి కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన ఇంటర్‌బ్రాండ్-2020 ర్యాంకింగ్‌ల్లోనూ తన సత్తా చాటి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 323 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, 200 బిలియన్ డాలర్లతో అమెజాన్‌కు రెండో స్థానం దక్కింది. 166 బిలియన్ డాలర్ల విలువతో మైక్రోసాఫ్ట్ మూడో స్థానంలో నిలవగా, 165 బిలియన్ డాలర్లతో గూగుల్‌కు 4వ స్థానం దక్కింది. శాంసంగ్, ఫేస్‌బుక్ వరుసగా 5, 12 స్థానాల్లో నిలిచాయి. ఫేస్‌బుక్ ఆధీనంలోని ఇన్‌స్టాగ్రామ్ 19వ స్థానంలో నిలిచింది. యూట్యూబ్-30, టెస్లా-40, జూమ్-100 ర్యాంకుల్లో నిలిచాయి. బ్రాండు విలువ అనేది కంపెనీ విలువకు సంబంధం ఉండదు. యాపిల్ కంపెనీ విలువ 2 లక్షల కోట్ల డాలర్లు కాగా, బ్రాండ్ విలువ 323 బిలియన్ డాలర్లు.